అంతర్జాతీయ చెస్ రంగంలో భారత సంతతికి చెందిన బ్రిటన్ బాలిక బోధన శివానందన్ (11) అద్భుతమైన రికార్డుతో చరిత్ర సృష్టించింది. కేవలం 11 ఏళ్ల 7 నెలల 16 రోజుల వయసులోనే ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ (IM) హోదాను దక్కించుకుని, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలైన బాలికగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
గతంలో చెస్ దిగ్గజం జుడిత్ పోల్గర్ 1988లో సాధించిన రికార్డును బోధన తాజాగా బద్దలు కొట్టింది. సరిగ్గా నెల క్రితం అతి పిన్న వయసులో ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ (WGM) హోదాను అందుకున్న ఈ చిన్నారి, ఇప్పుడు ఐఎం టైటిల్‌తో మరో అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది.
మొత్తం చెస్ చరిత్రలో (మహిళలు, పురుషులు కలిపి) ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించిన అతి పిన్న వయస్కుల జాబితాలో బోధన ప్రపంచవ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత స్టార్ ప్లేయర్ డి. గుకేశ్ (9వ స్థానం) రికార్డును కూడా ఆమె వెనక్కి నెట్టడం విశేషం.
లండన్‌లోని హారోలో పెరిగిన బోధన.. పాఠశాల విద్యతో పాటు చెస్‌ను సమన్వయపరుచుకుంటూ ఈ అసాధారణ విజయాన్ని సాధించింది. ఆమె తల్లిదండ్రులు తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందినవారు కాగా, ఉపాధి నిమిత్తం 2007లో యూకేకి వలస వెళ్లారు. లండన్‌లో జన్మించిన బోధన ఐదేళ్ల వయసులోనే చెస్ బోర్డుతో పరిచయం ఏర్పరచుకుని, అంచెలంచెలుగా ఎదిగింది.
తన చిన్న వయసులోనే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (WIM), ఉమెన్ ఫైడ్ మాస్టర్ (WFM) వంటి టైటిళ్లతో పాటు, గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగానూ బోధన గుర్తింపు తెచ్చుకుంది. భవిష్యత్తులో తాను ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌మాస్టర్ (GM) టైటిల్ కూడా సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భారతీయ మూలాలున్న ఈ ప్రతిభావంతురాలి విజయాలపై దేశవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.






































