లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై హాలియాపూర్ సమీపంలో సోమవారం ఉదయం సుమారు 10.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పరువునష్టం కేసు విచారణకు హాజరయ్యేందుకు ఆయన సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాన్వాయ్ ముందు వెళ్తున్న కాంగ్రెస్ నేతకు చెందిన ప్రైవేటు వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఐదు వాహనాలు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పలువురు భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన అనంతరం కాన్వాయ్ తిరిగి ప్రయాణాన్ని కొనసాగించి సుల్తాన్‌పూర్ వైపు వెళ్లింది.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువునష్టం కేసు దాఖలు చేశారు. 2018 ఆగస్టు 4న ఈ కేసు నమోదైంది. 2023లో విచారణకు హాజరైన రాహుల్ గాంధీ బెయిల్ పొందారు.
ఈ కేసులో తీర్పు ఈ నెల 13న వెలువడాల్సి ఉండగా, కోర్టు దానిని అక్టోబర్ 26కు వాయిదా వేసింది. విచారణ నేపథ్యంలో సుల్తాన్‌పూర్ కోర్టు పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






































