బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘అర్నబ్’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లాల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో ఆయన తాజాగా సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.
తుఫాన్ నేపథ్యంలో.. విపత్తు నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా ఉండేందుకు, తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు తన శాఖల పరిధిలోని (పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులకు మరియు సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని, కాకినాడ–యానాం పరిసర ప్రాంతాలపై కూడా ప్రభావం ఉండొచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు వాతావరణ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
తీర గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు, మత్స్యకార కాలనీల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పూరిళ్లు, బలహీనమైన ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారిని గుర్తించి సహాయక కేంద్రాలకు చేర్చాలని తెలిపారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు తన పరిధిలోని శాఖల సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తాగునీటి సరఫరా ఆగకుండా జనరేటర్లు, ఇంధన నిల్వలు సిద్ధంగా ఉంచాలని గ్రామీణ నీటి సరఫరా శాఖను ఆదేశించారు. గ్రామాల్లో మురుగునీరు నిలిచిపోకుండా డ్రైనేజీల్లో అడ్డంకులను తొలగించాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన యంత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. తుపాను అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలిపారు.
బాపట్ల నుంచి అనకాపల్లి వరకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల్లోని సహాయక కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, విద్యుత్, జనరేటర్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిన్నారులకు పాలు, వృద్ధులకు అవసరమైన మందులు, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మత్స్యకారులు అధికారిక అనుమతి వచ్చే వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పడవలు, వలలు, ఇతర పరికరాలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని సూచించారు. రిజర్వాయర్లు, కాలువలు, వాగుల్లో నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, బలహీనంగా ఉన్న గట్లు, కాలువ గేట్ల వద్ద ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద వరదనీరు ప్రవహిస్తే రాకపోకలను నియంత్రించాలని తెలిపారు.
బలమైన గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, సహాయక కేంద్రాలకు విద్యుత్ పునరుద్ధరణలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాల వద్దకు ప్రజలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లోని రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే రాకపోకలను నియంత్రించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సముద్ర తీరాలు, బీచ్‌లకు వెళ్లి సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం ప్రమాదకరమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ, జిల్లా యంత్రాంగం విడుదల చేసే అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. అన్ని శాఖలు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తూ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది, యంత్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.








































