ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet) సమావేశం అత్యంత కీలక నిర్ణయాలతో ముగిసింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతులు, సాంకేతికత మరియు పోలీసు శాఖ పటిష్టతకు సంబంధించిన 30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, హోంశాఖల నుంచి వచ్చిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి:
-
ట్రాఫిక్ మేనేజ్మెంట్ & రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్: రాష్ట్రంలో రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఏపీ పోలీసు శాఖలో ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్’ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఐజీ (IG) స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కొత్త విభాగం పనిచేయనుంది.
-
ఏఐ డేటా సెంటర్లు మరియు పాలసీలు: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అమనాంలో 512 మెగావాట్ల భారీ ఏఐ (AI) డేటా సెంటర్ ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 2036 వరకు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీలతో పాటు సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0లో కీలక సవరణలకు అంగీకరించింది. రాంబిల్లిలో ఈప్యాక్స్ (EPAC) డేటా సెంటర్ యూనిట్ ఏర్పాటుకు కూడా అనుమతించారు.
-
కొత్త పారిశ్రామిక పార్కులు: అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల విస్తీర్ణంలో ఫుట్వేర్ కాంపోనెంట్ పార్కు, అలాగే ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ‘ఎఫ్ఎల్వో మహిళా పారిశ్రామిక పార్కు’ (FLO Women Industrial Park) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
-
భారీ పెట్టుబడులు & ఇంధన ప్రాజెక్టులు: నాయుడుపేటలో లిథియం బ్యాటరీ మెటీరియల్ తయారీ పరిశ్రమతో పాటు, రూ. 4,000 కోట్ల పెట్టుబడితో కార్బన్ కార్బో సంస్థ పరిశ్రమ ఏర్పాటుపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో నూతన బయోగ్యాస్ ప్లాంట్లు, ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. 2026-31 కాలానికి గాను ‘ఏపీ ఏవీజీసీ-ఎక్స్ఆర్’ (AP AVGC-XR) పాలసీ ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
సమావేశం ముగిసినంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం.. ఎవరూ విజయగర్వాన్ని తలకెక్కించుకోవద్దని, మరింత బాధ్యతతో 2029 ఎన్నికలే లక్ష్యంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.








































