దిశ మార్చుకున్న అక్వాన్ తుఫాన్.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

Cyclone Akwan Changes Course Towards South Odisha, Averted For AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘అక్వాన్’ తుపాను ముప్పు తప్పింది. తొలుత మచిలీపట్నం-చెన్నై మధ్య, ఆ తర్వాత కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటుతుందని భావించిన ఈ తుపాను.. ఏపీ తీరానికి సమీపంగా వచ్చి దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు పయనిస్తోంది. బంగాళాఖాతంలోని ఉప ఉష్ణ మండల అధిక పీడన ప్రభావంతో ఈ తుపాను గమనంలో మార్పు వచ్చిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మొదటి నుంచీ ఇది నెమ్మదిగా గంటకు 3 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో కదులుతూ సముద్రంలోనే కొంత బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా వైపు వెళ్తున్నప్పటికీ కోల్‌కతా, బంగ్లాదేశ్ తీరాల వైపు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు.

వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, అక్వాన్ తుపాను దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. బుధవారం (నవంబర్ 18) రాత్రికి గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఇది.. నరసాపురానికి 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి 540 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 630 కిలోమీటర్లు, పూరీకి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

గురువారం (నవంబర్ 19) అర్ధరాత్రి వరకు ఇది తీవ్ర తుపానుగానే కొనసాగి, శుక్రవారం (నవంబర్ 20) మధ్యాహ్నానికి తుపానుగా మారి నరసాపురం-పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ప్రస్తుత గమనం ప్రకారం తుపాను పూర్తిగా దక్షిణ ఒడిశా వైపు పయనించే అవకాశం ఉన్నప్పటికీ, మార్గంలో ఏమైనా మార్పులు సంభవిస్తే శ్రీకాకుళం-పూరీ మధ్య తీరం దాటవచ్చని పేర్కొంది. ప్రధాన తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకు సమీపంగా పయనిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు ప్రత్యేక వర్ష హెచ్చరికలు జారీ చేసింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

అలాగే శుక్రవారం (నవంబర్ 20) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here