ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయమ్మ

APCC Chief YS Sharmila’s Daughter Anjali Reddy Marries Dr.Somala Raghurami Reddy in Nandi Hills Resort, Hyderabad

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలిరెడ్డి వివాహ వేడుక బెంగళూరు సమీపంలోని నందిహిల్స్ రిసార్టులో జరిగింది. వరుడు డాక్టర్ సోమల రఘురామిరెడ్డితో (సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడు) ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గతంలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి వివాహ పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకున్న అనంతరం, యలహంక నివాసానికి బదులుగా నందిహిల్స్ రిసార్టును వేదికగా ఖరారు చేశారు.

ఇరు కుటుంబాల సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు పద్ధతుల్లో ఈ వివాహ వేడుకలను నిర్వహించగా, బుధవారం సాయంత్రం క్రైస్తవ పద్ధతిలో, గురువారం (నవంబర్ 26) హిందూ సంప్రదాయం ప్రకారం నందిహిల్స్ పరిసర రిసార్టులో పెళ్లి వేడుకలు జరిగాయి.

బెంగళూరు సమీపంలో జరిగిన ఈ వివాహ వేడుకలను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించగా, ఇరువైపుల నుంచి సుమారు వంద మంది చొప్పున అతిథులు హాజరైనట్లు సమాచారం. రిసార్టులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద నూతన వధూవరులు అంజలిరెడ్డి, రఘురామిరెడ్డిలతో పాటు విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్, రాజారెడ్డి తదితరులు నిలిచిన దృశ్యాలు ఆకర్షించాయి.

ఈ వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకాకపోవడం, ఆయనకు సన్నిహితంగా ఉండే బంధువులెవరూ కార్యక్రమానికి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ ఆస్తుల వివాదాలు, రాజకీయ భేదాభిప్రాయాల నేపథ్యంలో అన్నాచెల్లెళ్ల మధ్య కొనసాగుతున్న దూరం మరోసారి స్పష్టమైంది.

కర్ణాటకలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకను పూర్తి చేయగా, డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రిసెప్షన్‌కు వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here