జూలై 11న మొదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,14 రోజులపాటు కొనసాగి మంగళవారం, జూలై 30న ముగిశాయి. ఈ సమావేశాలు ముగియడంతో ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 14 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతి పక్ష సభ్యుల మధ్య తీవ్ర ఆరోపణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్, ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివసిస్తున్న ఇంటిపై వివాదం, ఇసుక దోపిడీ, కాపు రిజర్వేషన్స్, పోలవరం ప్రాజెక్ట్, మద్యపాన నిషేధం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, నిరుద్యోగ సమస్య, మరియు నవరత్నాల అమలుపై గంటలపాటు చర్చలు జరిపారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు 80 గంటల పాటు సభ కొనసాగింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా 20 కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం పరిపాలన మెరుగుపర్చేందుకు, ప్రజల అవసరాలను త్వరితగతిన తీర్చేందుకు అవసరమైన బిల్లులను సభలో ఆమోదించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదం తరువాత అన్ని అమలులోకి రానున్నాయి. ఈ సమావేశాలలో సభా కార్యకలాపాలకు పదే,పదే అడ్డుపడుతున్నారని జూలై 23న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లను బడ్జెట్ సమావేశాలకు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసారు. వాదోప వాదనలు సాగినా కూడ, సమావేశాలు ఆసాంతం ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం విశేషం.
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.