ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్ లో ఇటీవల సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన నేపథ్యంలో.. ఆయా స్థలాల్లో త్వరితగతిన ఇళ్లు నిర్మించడంపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
కాగా సీఎం జగన్ ఇటీవలే మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడిన కొత్త పార్లమెంట్ భవనం కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులతో వరుస సమావేశాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. దాదాపు 40 నిమిషాల పాటు అమిత్ షాతో సమావేశమైన జగన్.. ఇప్పటికీ పరిష్కారం కాని అనేక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను వీలైనంత త్వరగా ఆమోదించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఢిల్లీ పర్యటన అంశాలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY