పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

#CAAProtests, Citizenship Amendment Act, Citizenship Amendment Act 2019, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Protests Against Citizenship Amendment Act, Supreme Court Refuses To Stay Citizenship Amendment Act

బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలను విభజించే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం ఉందని, వెంటనే ఈ చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో 60 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటీపై డిసెంబర్ 18, బుధవారం నాడు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపేవేసేలా స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ చట్టంపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జనవరి రెండో వారంలోగా పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది. ఈ చట్టంపై తదుపరి విచారణను జనవరి 22, 2020 కు వాయిదా వేసింది. చట్టంపై ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌, మజ్లీస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా, కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయం పార్టీ, అసోం గణ పరిషత్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, సహా పలు ఇతర రాజకీయ పార్టీలు, పలువురు వ్యక్తులు మరియు సంస్థలు సుప్రీంకోర్టులో దాదాపుగా 60 పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ, పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపురతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనను నిర్వహిస్తున్నారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పాకిస్థాన్‌ పార్లమెంటు తీర్మానం చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌లో మైనారిటీలపై తీవ్రంగా జరుగుతున్న పలు సంఘటనలు నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకే, ఇలాంటి తీర్మానాలు చేస్తోందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మండిపడ్డారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆందోళనలపై స్పందిస్తూ, ఈ చట్టంపై ప్రభుత్వం వెనక్కి తగ్గే ఆలోచనే లేదని, ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + ten =