ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం పలు ప్రముఖ ఔషధ కంపెనీలు మందులు, వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కూడా సిద్ధమైంది. కరోనా వైరస్ నివారణ కోసం ఓ వ్యాక్సిన్ను ఎంచుకున్నట్లు జాన్సన్&జాన్సన్ సంస్థ వెల్లడించింది. ఈ సంవత్సరం సెప్టెంబరు నెలలో మనుషులపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించి వచ్చే సంవత్సరం మొదట్లో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశమునట్టు సంస్థ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికా ప్రభుత్వరంగ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పెద్దఎత్తున పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని ఉత్తమ వ్యాక్సిన్లను ఎంచుకుని జంతువులపై ప్రయోగిస్తున్నామని, ఫలితాలను బట్టి సరైన వ్యాక్సిన్ ను ఎంచుకోవటానికి మరో రెండు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు.