నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (Delimitation) ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం (నవంబర్ 27) ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదన ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల సీట్ల సంఖ్యను సమాన నిష్పత్తిలో 50 శాతం పెంచనున్నారు. ఈ డీలిమిటేషన్, రిజర్వేషన్ ఏర్పాట్లకు సంబంధించిన నిష్పత్తిని 2051 సంవత్సరం వరకు కొనసాగించేలా నిర్ణయించినట్లు సమాచారం.
జనాభా మార్పుల ఆధారంగా పునర్విభజన జరిగితే కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, ప్రస్తుత రాష్ట్రాల సీట్ల వాటా నిష్పత్తిని 2051 వరకు యథాతథంగా ఉంచుతూ అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచాలని ప్రతిపాదించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుతో ఈ పునర్విభజన ప్రక్రియను అనుసంధానించినట్లు తెలుస్తోంది.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో లోక్‌సభ, డిసెంబర్ 2, 3 తేదీల్లో రాజ్యసభ ప్రత్యేకంగా సమావేశం కానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇదే అంశానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేకపోయింది. కేబినెట్ ఆమోదం పొందినప్పటికీ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి కావడంతో, రానున్న సమావేశాల్లో రాజకీయ పార్టీల వైఖరి, ఓటింగ్ సమీకరణాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.







































