తనకు అవకాశం వస్తే ప్రధానమంత్రిని కావాలనుకుంటానని, అంతేకానీ, రాష్ట్రపతి కావాలనుకోనని ప్రకటించారు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి మాయావతి. తాను ముఖ్యమంత్రి లేదా ప్రధాని కావడం ద్వారా అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి చేయగలనని ఆమె అన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తిరిగి అధికారంలోకి రావడానికి మాయావతే కారణమని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మాయావతి, అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. “నన్ను రాష్ట్రపతిని చేయాలని అఖిలేష్ కలలు కంటున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్‌లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే మార్గం సులువు చేసుకుంటున్నారు. నన్ను రాష్ట్రపతిని చేయాలని కలలు కనడం మానేయాలి, ఎందుకంటే నాకు రాష్ట్రపతి పదవిపై వ్యామోహం లేదు. అవకాశం వస్తే ప్రధానమంత్రిని కావాలనుకుంటాను” అని మాయావతి పేర్కొన్నారు.
డా. భీమ్‌రావ్ అంబేద్కర్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కలలు, ఆశయాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని మాయావతి తెలిపారు. “నేను బలహీన వర్గాల సాధికారత మరియు అభ్యున్నతి కోసం పోరాడుతున్నాను. నేను రాష్ట్రపతిని కాకుండా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కావడం ద్వారా అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తాను” అని మాయావతి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ముస్లింలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లను తప్పుదారి పట్టించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని యాదవ్ గ్రహించాలని ఆమె అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి అత్యధికంగా ముస్లిం, యాదవుల ఓట్లు వచ్చాయని ఆమె తెలిపారు. దళితులు, ముస్లింలు, ఓబీసీలు మద్దతు ఇస్తే ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లింలు ఉపవాసాలు పాటించే రంజాన్ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం విద్యుత్ కోత విధించడాన్ని మాయావతి తప్పుబట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ