మిస్ యూనివర్స్ కిరీటం కైవసం చేసుకున్న ప్యూర్టోరికో సుందరి జెన్నిఫర్ బారెటో

Miss Universe 2026 Jennifer Barreto of Puerto Rico Crowned For 75th Edition

ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్ 2026’ విశ్వసుందరి కిరీటాన్ని ప్యూర్టో రికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో కైవసం చేసుకున్నారు. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్ వేదికగా జోస్ మిగ్యుల్ అగ్రెలోట్ కొలీజియంలో జరిగిన 75వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో 116 దేశాల పోటీదారులతో తలపడి ఆమె ఈ ఘనత సాధించారు. ఈ విజయంతో ప్యూర్టో రికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో 1970, 1985, 1993, 2001 మరియు 2006లో ఆ దేశ సుందరులు విశ్వసుందరిగా నిలిచారు.

గత ఏడాది విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ కొత్త విజేత జెన్నిఫర్ బారెటోకు కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలలో డొమినికన్ రిపబ్లిక్ సుందరి మెలిసా నునెజ్ ఫస్ట్ రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా గోయెట్జ్ సెకండ్ రన్నరప్‌గా నిలువగా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ ప్రతినిధులతో కలిసి టాప్-5లో చోటు దక్కించుకున్నారు.

ముఖ్యంగా తుది రౌండ్‌లో “ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుండి అత్యంత అవసరమైన అంశం ఏమిటి?” అనే ప్రశ్నకు జెన్నిఫర్ బారెటో ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుంది. ఇతరులను విమర్శించే, ప్రశ్నించే ధోరణి పెరుగుతున్న ప్రస్తుత కాలంలో ‘వృత్తిపరంగా సానుభూతి (ప్రొఫెషనల్ ఎంపతీ)’ కలిగిన నాయకులు అవసరమని, విలువల కోసం నిలబడుతూ సమాజ అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించే నాయకత్వం మార్పు తీసుకురాగలదని ఆమె స్పష్టం చేశారు.

ఆసక్తి కలిగిస్తోన్న వ్యక్తిగత, వృత్తిపరమైన నేపథ్యం

విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో వ్యక్తిగత, వృత్తిపరమైన నేపథ్యం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సైకాలజీ మరియు క్లినికల్ సోషల్ వర్క్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన ఆమె, అమెరికా రక్షణ శాఖలో ప్రివెన్షన్ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తూ సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

కాగా, వివాహిత అయిన జెన్నిఫర్‌కు ఏడేళ్ల కుమార్తె పెనెలోప్ ఉన్నారు. మిస్ యూనివర్స్ సంస్థ 75 ఏళ్ల డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా 3,150 వజ్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ కిరీటాన్ని ఆమెకు బహూకరించారు.

మరోవైపు, ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో టాప్-30 రౌండ్ వరకు చేరుకుని, ఆ తర్వాత టాప్-12 జాబితాకు ఎంపిక కాకుండా నిష్క్రమించారు. దీంతో 2021లో హర్నాజ్ సంధు తర్వాత మరో మిస్ యూనివర్స్ కిరీటం కోసం భారత్ నిరీక్షణ కొనసాగింది.

కాగా, ఈ ఏడాది పోటీల నిర్వహణ, ఫ్రాంచైజీ వివాదాలపై కొన్ని విమర్శలు వినిపించగా, 76వ మిస్ యూనివర్స్ పోటీలకు వియత్నాం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here