డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన రష్యాకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. దీనిలో రావత్ తోపాటు ఆయన సతీమణి మధులిక, మరో పన్నెండు మంది ప్రయాణించారు. మొత్తం 14 మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు బృందం దర్యాప్తును పూర్తి చేసి తమ రిపోర్ట్ ను రక్షణశాఖకు అందజేసినట్లు తెలిసింది. హెలికాప్టర్ కూలిపోవడంపై దర్యాప్తు జరిపిన త్రివిధ దళాల దర్యాప్తు బృందం బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయింది. దర్యాప్తు వివరాలను ఆయనకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.
జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, దీనిపై భారత వాయు సేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ దర్యాప్తు జరిపింది. ఈ దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఈ బృందం రాజ్‌నాథ్ సింగ్‌కు బుధవారం వివరించింది. ఈ దర్యాప్తు బృందంలో భారత నావికా దళానికి చెందిన సీనియర్ హెలికాప్టర్ పైలట్ ఒకరు, సైనికాధికారి ఒకరు కూడా ఉన్నారు. మానవేంద్ర సింగ్ బెంగళూరులోని ఐఏఎఫ్ ట్రైనింగ్ కమాండ్‌కు అధిపతిగా ఉన్నారు. విమానాలు, హెలికాప్టర్లు కూలిపోయిన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో మానవేంద్ర సింగ్ నిపుణుడు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడానికి కారణం సాంకేతిక లోపం కాదని ఈ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీనిలోని సిబ్బంది అత్యున్నత స్థాయి నిపుణులని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురయ్యే ముందు ఈ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించిందని గుర్తించారు.
కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్కు బయల్దేరిన MI-17V5 హెలికాప్టర్ కనూర్ సమీపంలో దట్టమైన మేఘాల్లో చిక్కుకుంది. మేఘాల్లో చిక్కుకోవడంతో ముందున్న దృశ్యాలు అస్పష్టంగా కనిపించాయి. దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ ఇబ్బందులు పడ్డాడు. దారి కోసం రైల్వే లైన్‌ను హెలికాప్టర్ పైలట్ అనుసరించాడు. హెలికాప్టర్ పైలట్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ, అనుకోకుండా భూమిపైకి దించారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఎత్తయిన శిఖరం అంచును హెలికాప్టర్ అనూహ్యంగా ఢీకొట్టింది. అదేవేగంతో హెలికాప్టర్ కిందికి పడిపోయింది’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నివేదికలో వెల్లడించింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు పూర్తయిందని, అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఈ నివేదికను రూపొందించారని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ