విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, వన్ టౌన్ ఇన్‌ఛార్జ్ బుద్దా వెంకన్న, పలువురు కార్పొరేటర్ల సమక్షంలో ఆయన మేయర్ బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయవాడలో శానిటేషన్, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టేలా తొలి ఫైల్‌పై సంతకం చేశారు. విజయవాడ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని తప్పకుండా నిలబెట్టేలా అంకితభావంతో సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
నగరంలోని పౌర సమస్యలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తామని మేయర్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వర రావు, సుజనా చౌదరితో సమన్వయం చేసుకుంటూ కార్పొరేటర్లందరి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. విజయవాడను సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దే దిశగా పరిష్కార మార్గాలతో ముందుకు సాగుతామని వివరించారు.
శానిటేషన్, హెల్త్ అంశాలపై తొలి సంతకం చేశామని, దీనికోసం 30 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను ప్రణాళిక చేస్తున్నామని వంగవీటి రాధాకృష్ణ వెల్లడించారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఈ డ్రైవ్ పూర్తి కార్యాచరణను ప్రకటిస్తామని మేయర్ స్పష్టం చేశారు.







































