అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మళ్ళీ ట్విట్టర్ లోకి అనుమతించేది లేదని ట్విట్టర్ సంస్థ నిర్ధారించింది. ముందుగా జనవరి నెలలో అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింస, కాల్పులు చోటుచేసుకున్న సమయంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం విధించారు. అనంతరం ఆయన ఖాతాను పూర్తిగా మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్ మాట్లాడుతూ ట్రంప్ ట్విట్టర్ ఖాతా నిషేధం నిర్ణయం శాశ్వతమని చెప్పారు. ట్రంప్ 2024 లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అధ్యక్షుడు అయినా కూడా ఆయనను మళ్ళీ ట్విటర్లోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు.
తమ సంస్థ విధానాల ప్రకారం ఒకసారి ప్లాట్ఫాం నుండి తొలగిస్తే వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నా లేదా మాజీ అయిన, ఇతరులెవరైనా కూడా ఒకే విధమైన విధానాలు అమలు చేయబడతాయని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉండేవారు. పలు ప్రకటనలు చేయడంతో పాటుగా, తనపై వచ్చే ఎన్నో విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టేవారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతా రద్దయ్యే సమయానికి ఆయనకు 80 మిల్లియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ