జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ కర్తవ్యబోధ

2021 GHMC Mayor Election, Corporators Meets CM KCR, Deputy Mayor Election, Gadwala Vijayalakshmi, Gadwala Vijayalakshmi Elected as GHMC Mayor, GHMC, GHMC Deputy Mayor, GHMC Mayor, GHMC Mayor Deputy Mayor Election, Greater Hyderabad Mayor, Greater Hyderabad Municipal Corporation, Hyderabad Mayor and Deputy, Mango News, Mayor Election, Mayor Election 2021, Newly Elected GHMC Mayor, Pragathi Bhavan, TRS Corporator Gadwala Vijayalakshmi, TRS Corporator Gadwala Vijayalakshmi Elected as GHMC Mayor

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కు కొత్తగా ఎన్నికైన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ వారికీ కర్తవ్యబోధ చేశారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

‘‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటెనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని సీఎం కేసీఆర్ హితవు పలికారు.

‘‘పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనయినంత సాయం చేయాలి. అబద్దాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి’’ అని చెప్పారు.

హైదరాబాద్ నిజమైన విశ్వనగరం, గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి:

‘‘హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింథ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నారు. ఖాయస్తులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉన్నది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

‘‘ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్ గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, సురేష్ రెడ్డి, సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =