భారత ఉత్పత్తులపై అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టీఆర్) 25 శాతం సుంకాలను (టారిఫ్‌లను) ప్రతిపాదించింది. అయితే అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఈ సుంకాలను 17 శాతానికి తగ్గిస్తామని యూఎస్‌టీఆర్ జేమీసన్ గ్రీర్ వెల్లడించారు. భారత్ సహా చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా యూనియన్, బంగ్లాదేశ్ వంటి మొత్తం 14 ఆర్థిక వ్యవస్థలపై కొత్త సుంకాలను ప్రతిపాదించినప్పటికీ, ఇవి వెంటనే అమల్లోకి రావు.
వీటిపై అమెరికా ప్రజలు జనవరి 5లోగా రాతపూర్వకంగా అభిప్రాయాలు సమర్పించవచ్చని, జనవరి 25న బహిరంగ విచారణ నిర్వహిస్తామని యూఎస్‌టీఆర్ తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో విధించిన భారీ సుంకాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, మిగులు ఉత్పత్తులతో తమ కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందా అనే అంశంపై మార్చిలో సెక్షన్-301 కింద 16 ఆర్థిక వ్యవస్థలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఆ విశ్లేషణ ఆధారంగా మెక్సికో, నార్వే మినహా మిగిలిన వాటిపై సుంకాలు ప్రతిపాదించారు. సబ్సిడీలు, అధిక ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్‌లో చవకగా సరకులు కుమ్మరిస్తున్నారని, ఔషధాలు, ఉక్కు, ఐసీటీ వంటి రంగాల్లో భారత్‌లో మిగులు ఉత్పత్తి ఉందని గ్రీర్ ఆరోపించారు.
వాణిజ్య ఒప్పందాలున్న దేశాలకు 15-20 శాతం టారిఫ్‌లు ప్రతిపాదించామని, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్‌లపై 18 శాతం.. చైనా, వియత్నాంపై 20 శాతం, అలాగే, ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్‌లపై 15 శాతం సుంకాలు ప్రతిపాదించినట్లు వివరించారు.
ఈ ప్రతిపాదిత సుంకాలు గతంలో బలవంతపు కార్మిక చట్టాల కింద విధించిన 10 శాతం సుంకానికి కానీ, స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి రంగాలపై సెక్షన్-232 కింద ఉన్న ప్రత్యేక సుంకాలకు కానీ అదనం కావని అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. భారతీయ ఎగుమతిదారులు పాత 10 శాతం సుంకానికి అదనంగా కొత్త సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని, రెండింటిలో ఏది ఎక్కువ రేటు ఉంటే అది వర్తిస్తుందని తెలిపారు.
మరోవైపు, సరకులను మితిమీరి ఉత్పత్తి చేస్తున్నామన్న అమెరికా ఆరోపణలను భారత్ ఖండించింది. తమకు ఏ రంగంలోనూ వ్యవస్థాపక ఉత్పత్తి సామర్థ్యం అవసరానికి మించి లేదని స్పష్టం చేసింది. యూఎస్‌టీఆర్ ప్రతిపాదించిన సుంకాలను పరిశీలిస్తున్నామని, వాణిజ్య సంబంధిత అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.





































