అమెరికాలో ప్రతి బిడ్డకు 2 స్పేస్‌ఎక్స్ షేర్లు – ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

Elon Musk Promising Two SpaceX Shares To Every Child in the US

అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థకు చెందిన రెండు షేర్లను బహుమతిగా ఇస్తామని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. గత నెలలో ఇచ్చిన ఒక షేరు హామీని ఆయన ఇప్పుడు రెట్టింపు చేశారు. ఒక్కో బిడ్డకు స్పేస్‌ఎక్స్ సంస్థ తరఫున ఒక షేరు, తన వ్యక్తిగత వాటా నుంచి మరో షేరు కలిపి మొత్తం రెండు షేర్లు అందజేస్తామని గురువారం (నవంబర్ 26) ఎక్స్ వేదికగా వెల్లడించారు.

బుధవారం ముగిసిన స్పేస్‌ఎక్స్ షేరు ధర (127.44 డాలర్లు) ఆధారంగా ఈ మొత్తం షేర్ల బహుమతి విలువ సుమారు 18 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. పద్దెనిమిదేళ్లలోపు చిన్నారుల పెట్టుబడుల కోసం రూపొందించిన ‘ట్రంప్ అకౌంట్స్’ కార్యక్రమం ద్వారా స్పేస్‌ఎక్స్ క్లాస్-ఏ షేర్లను బదిలీ చేసే ప్రక్రియపై దృష్టి పెట్టారు. స్పేస్‌ఎక్స్ అందించే షేరు వచ్చే నెలలో బదిలీ కానుండగా, మస్క్ వ్యక్తిగత షేరు లాక్-ఇన్ గడువు ముగిసే వచ్చే ఏడాది జూన్‌లో బదిలీ అవుతుందని సమాచారం.

ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ప్రతి ఏటా అమెరికాలోని పిల్లలందరికీ మరో స్పేస్‌ఎక్స్ షేరును దానం చేస్తానని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు నేరుగా వాటా కల్పించడం ద్వారా దీర్ఘకాలిక మద్దతు, ఆర్థిక అవగాహన పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్పేస్ లాంచ్, స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్, అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్ల విస్తరణ వంటి కీలక ప్రణాళికల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్వెన్ షాట్‌వెల్ దంపతులు కూడా తమ షేర్ల నుంచి విరాళం ప్రకటించగా, ఏఐ రంగంలో వృద్ధి ఫలాలను సమాజంతో పంచుకునే విధానాలపై విస్తృత చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here