అమెరికా ఎన్నికలు: 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్, కోర్టును ఆశ్రయించిన ట్రంప్

US Election Results: Joe Biden Inching Towards 270 Mark, Trump Campaign Files Lawsuit in 3 States

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది. అధ్యక్ష పీఠం కోసం 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాల్సి ఉండగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఇప్పటికే 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, 6 ఓట్ల దూరంలో నిలిచారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు కైవసం చేసుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ 23 రాష్ట్రాల్లో విజయం సాధించగా, 22 రాష్ట్రాల్లో జో బిడెన్ విజయం సాధించారు. ఇంకా మిగిలిన 5 రాష్ట్రాలైన అలస్కా, జార్జియా, నెవాడ, నార్త్‌ కరోలినా, పెన్సిల్వీనియా రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. వీటిల్లో నాలుగు చోట్ల ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, ఒక చోట బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

మరోవైపు ముందుగా ప్రకటించిన విధంగానే కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపుపై డొనాల్డ్‌ ట్రంప్‌ కోర్టులను ఆశ్రయించారు. ముఖ్యంగా తను భారీ ఆధిక్యంలో ఉన్న పెన్సిల్వేనియా, మిషిగన్‌ మరియు జార్జియా రాష్ట్రాల్లో ఒక్కసారిగా బైడెన్‌ ఆధిక్యంలోకి వస్తుండడంతో ఓట్ల కౌటింగ్ పై ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. దీంతో ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్‌ను వెంటనే ఆపాలని ట్రంప్ ప్రచార బృందం అక్కడి కోర్టుల్లో దావా (లాసూట్) వేశారు. మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని జో బైడెన్ బృందం వ్యతిరేకిస్తుంది. ఎక్కడా కూడా కౌంటింగ్‌ను ఆపే ప్రసక్తే లేదని, కౌటింగ్ కొనసాగేలా చూడాలని బైడెన్‌ తన బృందాలను రంగంలోకి దింపారు. ఈసారి అమెరికా ఎన్నికల్లో గత వందేళ్ల కాలంలోనే అత్యధిక పోలింగ్‌ నమోదవడంతో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ పై కోర్టును ఆశ్రయించడంతో ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష తుది ఫలితం రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 8 =