రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండ్ షోతో ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1 ఏకపక్ష పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు అద్భుతంగా రాణించడంతో వరుసగా రెండోసారి ఆర్‌సీబీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్ చేరడానికి ఈనెల 29న జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
రజత్ పటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారీ స్కోరు:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రజత్ పటీదార్ కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా క్రునాల్ పాండ్యా (43), విరాట్ కోహ్లీ (43), దేవ్‌దత్ పడిక్కల్ (30) వేగంగా ఆడారు. రజత్-క్రునాల్ జోడీ నాలుగో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గుజరాత్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడలకు రెండేసి వికెట్లు దక్కాయి.
కుప్పకూలిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్:
255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ జట్టు 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ అనుకూలించడంతో ఆర్‌సీబీ బౌలర్లు పవర్‌ప్లేలోనే 51 పరుగులకే 5 వికెట్లు తీసి గుజరాత్‌ను గట్టి దెబ్బకొట్టారు. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (2) వంటి విజయవంతమైన ఓపెనర్లు తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. బట్లర్ (29) వేగంగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
లోయర్ ఆర్డర్‌లో రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం చేస్తూ 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీయగా, క్రునాల్, రసిఖ్, భువనేశ్వర్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటీదార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు శుభారంభం అందించాడు. 25 బంతుల్లో 43 పరుగులు చేసిన కోహ్లీ.. ఒక సిక్స్, ఐదు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో ప్రస్తుత సీజన్‌లో తన పరుగుల సంఖ్యను 600 దాటించాడు.
దీంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్లలో (2023 నుంచి 2026 వరకు) 600కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. కేఎల్ రాహుల్ 2020-2022 మధ్య వరుసగా మూడు సీజన్లలో, క్రిస్ గేల్ 2011-2013 మధ్య ఈ ఫీట్ నమోదు చేశారు.
ఇప్పుడు వారిని అధిగమిస్తూ కోహ్లీ తన పేరును ప్రత్యేకంగా చరిత్రలో నిలిపాడు. స్థిరమైన ప్రదర్శనతో ప్రతి సీజన్‌లోనూ పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ.. మరోసారి తన క్లాస్‌ను నిరూపించుకున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
స్కోరుబోర్డు
బెంగళూరు బ్యాటింగ్: వెంకటేష్ (సి) గిల్ (బి) రబాడ 19, కోహ్లీ (బి) హోల్డర్ 43, పడిక్కళ్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 30, రజత్ పటీదార్ (నాటౌట్) 93, క్రునాల్ (సి) సుదర్శన్ (బి) రబాడ 43, డేవిడ్ (బి) ప్రసిద్ధ్ 4, జితేష్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 254/5.
వికెట్ల పతనం: 1-21, 2-93, 3-94, 4-189, 5-214.
బౌలింగ్: సిరాజ్ 3-0-46-0, రబాడ 4-0-54-2, హోల్డర్ 4-0-39-2, రషీద్ 3-0-29-0, ప్రసిద్ధ్ 4-0-53-1, కుల్వంత్ 2-0-31-0.
గుజరాత్ బ్యాటింగ్: సాయి సుదర్శన్ (హిట్ వికెట్) (బి) డఫీ 14, గిల్ (బి) భువనేశ్వర్ 2, బట్లర్ (బి) హాజెల్‌వుడ్ 29, నిషాంత్ సింధు (సి అండ్ బి) రసిఖ్ 5, వాషింగ్టన్ (సి) హాజెల్‌వుడ్ (బి) డఫీ 8, హోల్డర్ (సి) హాజెల్‌వుడ్ (బి) రసిఖ్ 0, తెవాటియా (సి) పటీదార్ (బి) భువనేశ్వర్ 68, రషీద్ (సి) జితేష్ (బి) డఫీ 8, రబాడ (సి) కోహ్లీ (బి) క్రునాల్ 9, సిరాజ్ (సి) డేవిడ్ (బి) క్రునాల్ 5, ప్రసిద్ధ్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.3 ఓవర్లలో 162 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-17, 2-27, 3-51, 4-51, 5-51, 6-65, 7-78, 8-88, 9-156, 10-162.
బౌలింగ్: డఫీ 4-0-39-3, భువనేశ్వర్ 4-0-28-2, హాజెల్‌వుడ్ 4-0-39-1, రసిఖ్ 3-1-24-2, క్రునాల్ 3.3-0-16-2, షెఫర్డ్ 1-0-15-0.





































