బండి భగీరథ్‌ కేసు.. ఫామ్‌హౌస్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్

Bandi Bhagirath Case Police Recreate Crime Scene at Moinabad Farmhouse

తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. మేడ్చల్ జిల్లా న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో అధికారులు బుధవారం బండి భగీరథ్‌ను చర్లపల్లి జైలు నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కస్టడీ ప్రక్రియ ముగిసిన వెంటనే అతడికి మేడ్చల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కూకట్‌పల్లి డీసీపీ కార్యాలయంలో డీసీపీ రితిరాజ్ సమక్షంలో భగీరథ్‌ను సుదీర్ఘంగా విచారించారు.

ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి సీన్ రీకన్‌స్ట్రక్షన్

ప్రాథమిక విచారణ అనంతరం సిట్ అధికారులు భగీరథ్‌ను అత్యంత రహస్యంగా మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. ఈ కీలక ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అటు మీడియాకు కానీ, ఇటు స్థానిక పోలీసులకు కానీ లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఘటన జరిగిన సమయంలో బాధిత బాలికను అక్కడికి ఎన్నిసార్లు తీసుకువచ్చారు, ఫామ్‌హౌస్‌లో ఎవరెవరు ఉన్నారు, అక్కడ అసలు ఏం జరిగిందనే అంశాలపై భగీరథ్‌ను అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో క్రైమ్ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ (ఘటనా స్థలి పునర్నిర్మాణం) చేయడం ద్వారా కేసు డైరీకి అవసరమైన పలు కీలక భౌతిక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

సాంకేతిక ఆధారాలపై ఫోకస్.. నేడు అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు

ఈ కేసులో మరింత స్పష్టత కోసం భగీరథ్‌తో పాటు అతడి స్నేహితులను, బాధితురాలిని కూడా పిలిపించి గురువారం ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే రికార్డు చేసిన స్నేహితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా భగీరథ్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. వీటితో పాటు బాధితురాలికి, భగీరథ్‌కు మధ్య జరిగిన వాట్సాప్‌, స్నాప్‌చాట్‌ చాటింగ్‌లతో పాటు ఫోన్ కాల్ డేటా రికార్డులను కూడా సాంకేతిక ఆధారాలుగా పరిశీలిస్తున్నారు. నేడు నానక్‌రామ్‌గూడలోని ఒక ప్రముఖ అపార్ట్‌మెంట్‌లో భగీరథ్‌ మరియు అతడి స్నేహితుల సమక్షంలో మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here