ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విసృతమైన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, జూన్ 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నిరసనల నిర్వహణ తీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారు
ఎన్నికల ముందు ప్రజలకు నమ్మశక్యం కాని అనేక అబద్ధపు హామీలను ఇచ్చి సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. “మనం చిన్నప్పుడు చదువుకున్న ముసలి పులి-బంగారు కడియం కథ లాగే సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు రంగురంగుల పథకాలు ఇస్తానని ప్రజలను నమ్మించారు. తీరా ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఆ కథలోని పులి బాటసారులను తిన్నట్లుగా, ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలను పీడించి తినేస్తున్నారు” అని ఘాటుగా ధ్వజమెత్తారు.
సీఎం చంద్రబాబుకు వైకాపా అంటే ఎంత భయమంటే.. “ఆయన్ను ఎవరైనా నిద్రలోంచి టపీమని లేపి చెవిలో ‘మావిగన్’ (వైకాపా సోషల్ మీడియా అస్త్రం) అని అంటే చాలు.. ఆయన భయంతో అక్కడికక్కడే పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు” అంటూ ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో దారుణాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైతే సీరియస్ యాక్షన్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ నేతలంతా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా ప్రతిచోటా వైకాపా జెండా మాత్రమే ఎగరాలని కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల బరిలో అధికార కూటమి పార్టీలకు ఎక్కడైనా ఏవైనా సీట్లు ఏకగ్రీవమైతే మాత్రం దానిని తాను చాలా సీరియస్‌గా తీసుకుంటానని హెచ్చరించారు.
ఏకగ్రీవాలు జరిగితే అది ఖచ్చితంగా సంబంధిత నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త (ఇన్‌ఛార్జ్) వైఫల్యంగానే భావించి వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎస్సీ గ్రామాల్లోనూ ఎక్కడా వెనకడుగు వేయకుండా గట్టి అభ్యర్థులను వెతికి పోటీలోకి తీసుకురావాలని, ప్రజాక్షేత్రంలో ఉంటూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.




































