అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి సంబంధించి ఒక కీలక ముందడుగు పడింది. తాము ఎప్పటికీ అణ్వాయుధాలను సమకూర్చుకోబోమని, వాటిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక ఫ్రేమ్‌వర్క్ (MOU) పత్రాలపై ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ డిజిటల్ రూపంలో సంతకాలు చేశారు.
ఇక మరోవైపు ఇరాన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ కూడా ఈ పత్రాలపై సంతకం చేశారు. ఈ ప్రాథమిక ఒప్పందం అనంతరం అధికారిక కార్యక్రమం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగనుందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.
డెమోక్రాట్ల ఆరోపణలను తిప్పికొట్టిన ట్రంప్
ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు అమెరికా 300 మిలియన్ డాలర్లు చెల్లించనుందంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా డెమోక్రాట్లు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా కొట్టిపారేశారు.
జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ఫ్రాన్స్‌కు చేరుకున్న ఆయన, అక్కడ మీడియాతో మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లో జరిగే తుది సంతకాల కార్యక్రమానికి అమెరికా బృందం తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. ఈ డీల్ వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఉన్న ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్, ఇజ్రాయెల్ స్పందనలు
నెలల తరబడి సాగిన దౌత్య చర్చల ఫలితంగానే ఈ ముందడుగు సాధ్యమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. అయితే ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదని ఆ దేశ ప్రధాన కార్యాలయం స్పష్టం చేసింది. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకుండా అడ్డుకోవడమే తన జీవిత ఆశయమని, ఒప్పందాలు ఉన్నా లేకపోయినా ఇరాన్‌ను ఎప్పటికీ అణురాజ్యంగా ఎదగనివ్వబోనని ఇజ్రాయెల్ ప్రధాని బెెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు.
అయినప్పటికీ, సుసంపన్నమైన యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై కఠినమైన ఆంక్షలు విధించడం వంటి అంశాలు ఈ తుది ఒప్పందంలో ఖచ్చితంగా ఉంటాయని అమెరికా హామీ ఇచ్చింది.
ఒప్పందం ముఖ్యాంశాలు, పరిణామాలు
ఈ నూతన ఒప్పందం పూర్తిగా ఇరాన్ ప్రవర్తన ఆధారిత నమూనా (పర్ఫార్మెన్స్ బేస్డ్ మోడల్)పై పనిచేస్తుందని అమెరికా ఉన్నతాధికారులు వివరించారు. ఇరాన్ తన అణు కేంద్రాల తనిఖీలకు అంతర్జాతీయ సంస్థలను అనుమతించడం, ఉగ్రవాద సంస్థలకు నిధుల నిలిపివేత వంటి కీలక బాధ్యతలను నెరవేర్చినప్పుడే దానికి తగినట్లుగా ఆంక్షల సడలింపు మరియు ఆర్థిక ప్యాకేజీలు అందుతాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
ఇరాన్ తన అణ్వాయుధాల ఆలోచనను శాశ్వతంగా పక్కనబెట్టడమే లక్ష్యంగా కుదిరిన ఈ ఎంవోయూ అత్యంత శక్తివంతమైన పత్రమని, జెనీవాలో తుది సంతకాలు ముగిసిన వెంటనే దీని పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.




































