నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం, మరోసారి సూపర్ ఓవర్ తో మ్యాచ్ కైవసం

2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, India Beat New Zealand via Super Over, India vs New Zealand, India vs New Zealand Match, India vs New Zealand Match Live Updates, latest sports news, latest sports news 2020, Mango News Telugu, sports news

భారత్-న్యూజిలాండ్‌ మధ్య వెల్లింగ్టన్ వేదికగా జనవరి 31, శుక్రవారం నాడు జరిగిన నాలుగో టీ20లో సూపర్ ఓవర్ ద్వారా భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్యసాధనలో న్యూజిలాండ్ సైతం 165 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా వేసిన చివరి ఓవర్లో న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను టై గా మార్చుకోవడంతో మరో సూపర్ ఓవర్ ఫలితం వైపుగా మ్యాచ్ మళ్లింది. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్ నిర్వహించగా న్యూజిలాండ్ నిర్దేశించిన 14 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. సూపర్ ఓవర్లో కేఎల్ రాహుల్ సిక్స్, ఫోర్ బాధగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోర్ తో భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. సూపర్ ఓవర్లో భారత్ రాహుల్ వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. ఐదు టీ20ల సిరీస్ లో ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న భారత్, ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ దిశగా ముందుకెళుతోంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (39: 3×4, 2×6), మనీష్ పాండే (50*: 3×4) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మకి విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్‌ (8) పరుగులకే వెనుదిరగగా, వన్ డౌన్ లో వచ్చిన విరాట్‌ కోహ్లీ కూడా (11) పరుగులకే అవుట్ అయ్యాడు. ఆతర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (1), శివమ్ దూబే (12), వాషింగ్టన్ సుందర్‌ (0) లు వరుసగా వికెట్లు ఇచ్చేసి పెవిలియన్ బాట పట్టడంతో 88 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి భారత్ జట్టు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ (20)తో కలిసి మనీష్‌ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసిన పాండే నాటౌట్ గా నిలిచాడు. చివర్లో నవదీప్ సైని(11) రెండు ఫోర్లతో బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 165 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్ ఐష్ సోధి మూడు వికెట్లు పడగొట్టగా, బెన్నెట్ రెండు వికెట్లు తీశాడు.

ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్ మున్రో (64: 6×4, 3×6) శుభారంభాన్ని ఇచ్చాడు. గుప్తిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ సీఫెర్ట్(57:4×4, 3×6) సైతం విజృంభించి ఆడాడు. రాస్ టేలర్(24) తో కలిసి భారత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును విజయంవైపు నడిపించాడు. అయితే చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 7 పరుగులు అవసరంకాగా శార్దూల్ ఠాకూర్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఈ ఓవర్లో రాస్ టేలర్, మిచెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా, సీఫెర్ట్ మరియు సాట్నార్ రన్ అవుట్ అయ్యి వెనుదిరగడంతో మ్యాచ్ టైగా మారింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సూపర్‌ ఓవర్‌లో మున్రో, సీఫెర్ట్ బ్యాటింగ్‌ కు వచ్చి బుమ్రా బౌలింగ్ లో 13 పరుగులు చేశారు. అలాగే భారత్ తరుపున విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, సంజు శాంసన్ బ్యాటింగ్‌ చేసి టిమ్‌ సౌతీ బౌలింగ్‌ లో 16 పరుగులు చేయడంతో భారత్ జట్టు ఘనవిజయాన్ని అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here