వ్యవసాయ శాఖ కాగితం-కలం శాఖగా కాకుండా పొలం-హలం శాఖగా మారాలి: సీఎం కేసీఆర్

Agricultural Marketing Department, CM KCR, CM KCR held a Meeting with District-level Agriculture, CM KCR Meeting, CM KCR Meeting With Marketing Officials, Department of Agricultural Marketing, District-level Agriculture and Marketing Officials, Mango News, Marketing Officials, Telangana Agricultural Department, Telangana Marketing Officials, Telangana State Portal Agriculture

తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వ్యవసాయ శాఖ కాగితం-కలం శాఖగా కాకుండా పొలం-హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంభించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

పదిరోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారో సరైన లెక్కలు తీయాలి:

పదిరోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలనీ, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రగతిభవన్ లో ఆదివారం నాడు జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి-రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను సీఎం ఈ సందర్భంగా విడమర్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించింది:

“అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇలా జరిగింది అలా జరిగింది అంటూ చెప్పుకునే విజయ గాథలను ఇంతవరకు విన్నాం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వంద శాతం నల్లాల ద్వారా నీరందించి నెంబర్ వన్ గా నిలవడం మిషన్ భగీరథ వల్ల సాధ్యమైంది. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసుకోగలుగుతున్నాం. రెవెన్యూలో అత్యంత జటిలమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములు రికార్డుల నిర్వహణను, రిజిస్ట్రేషన్లను, మ్యుటేషన్లను సులభతరం చేసుకున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామసీమల రూపురేఖలే మారిపోయాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు వచ్చాయి. డంప్ యార్డులు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, కల్లాలు వచ్చాయి. ఇలా ప్రతీ రంగంలోనూ ఎన్నో అద్భుత విజయాలు తెలంగాణ రాష్ట్రం సాధించింది. అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి” అని సీఎం కేసీఆర్ అన్నారు.

1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం:

“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు వస్తుంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి” అని సీఎం పిలుపునిచ్చారు.

ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి:

“రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాల పై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో సమావేశాలు నిర్వహించాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాల పై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్నపంటల విషయంలో స్పష్టత రావాలి” అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన ఇతర విషయాలు, ఇచ్చిన ఆదేశాలు:

  • అన్ని రైతు వేదికలను వెంటనే ఉపయోగంలోకి తేవాలి. ఏఈఓ, రైతుబంధు సమితి కార్యాలయాలను రైతువేదికల్లోనే ఏర్పాటు చేయాలి. రైతు వేదికలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. మైక్ సెట్ సమకూర్చాలి. ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి. ఏ క్లస్టర్ లో ఐనా ఏ కారణం చేతనైనా ఏఈఓ పోస్టు ఖాళీయైన, ఎవరైనా దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి.
  • రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణ రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తాం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలి. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్ కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలి. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మార్కెంటింగ్ శాఖను మరింత బలోపేతం చేసుకోవాలి. కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తాం.
  • రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నది అనే వివరాలు సేకరించాలి. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటి పై రైతులకు అవగాహన కల్పించాలి.
  • యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది.
  • మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
  • ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్ లో పర్యటించాలి.
  • పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.
  • ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి.
  • వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
  • మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి.

దాదాపు 8 గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎంపి కె. కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్క్ ఫెడ్ ఛైర్మన్ మారం గంగారెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కమీషనర్ అనిల్ కుమార్, డైరక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ కార్పోరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =