మే నెలలో యాదాద్రి ఆల‌యం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్

Andhra Pradesh, CM KCR, CM KCR Says Yadadri Temple Likely to Restart, CM KCR Says Yadadri Temple Likely to Restart in May Month, CM KCR to inspect Yadadri temple works, CM KCR visits Sri Lakshmi Narasimha Swamy Temple, KCR Says Yadadri Temple Likely to Restart, Mango News, Re-inauguration of Yadadri, Refurbished Yadadri temple, Reopening of refurbished Yadadri temple, yadadri temple

యాదాద్రి దివ్య క్షేత్ర పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సుమారు ఆరుగంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునఃనిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇంకా అసంపూర్తిగా వున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు.

హైదరాబాద్ నుంచి యాదాద్రికి చేరుకున్న సీఎం, తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలో ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి, అవి ఎన్నిరోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై సీఎం ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో కలియదిరిగిన సీఎం కేసీఆర్, మాడ వీధులు, క్యూ లైన్ దారి, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణీ, భక్తుల స్నాన గుండం నిర్మాణం, మెట్ల దారి నిర్మాణం పరిశీలించారు. మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. ఆలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపం (ఆర్ణమెంటల్ లుక్కు) తో వుండేలా, బ్రాస్ మెటల్ తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తి భావన వుట్టి పడేలా దీపాలంకరణ ఉండాలన్నారు.

దేవాలయ ముందుభాగం కనుచూపు మేర నుంచి చూసినా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని, ప్రాచీనత, నవ్యతతోపాటు దైవ సందర్శకులకు, భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలని కోరారు. తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర సహా నరసింహుని చరిత్రను తెలియపరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణంలో అలంకరించాలన్నారు. ప్రహరీని ఆనుకుని వుండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూ లైన్ దారిని నిర్మించాలని కోరారు.

మూల విరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. గర్భగుడి ముందరి ధ్వజస్థంభాన్ని హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూర్ పెయింటింగులను పరిశీలించారు. నృసింహ స్వామి గర్భగుడిలో పూజలు చేశారు. బంగారు తాపడం చేసిన పలు దేవతా మూర్తులను పరిశీలించారు. ఆండాళ్ ఆల్వార్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్ దైవ దర్శనానంతరమే క్షేత్రపాలకుని దర్శనం ఆనవాయితీగా వస్తున్నదని, దాన్నే కొనసాగించాలని సూచించారు. అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నపుడు హడావిడి పడకూడదన్నారు. తిరుపతిలో లాగా, స్వామి వారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా ప్రభుత్వం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నదన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించు కోవాలను అధికారులకు చెప్పారు. నిర్మాణం పూర్తికావచ్చిన ఈవో కార్యాలయాన్ని, స్వామి వారి పల్లకీ గద్దెను, అద్దాల మండపాన్ని పరిశీలించిన సీఎం, రెయిలింగ్ పనులను చూసి మెచ్చుకున్నారు. అద్దాల మండపాన్ని అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా ఉండేల తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే చైనా సందర్శించి, అక్కడ 7 కి.మీ. దూరం లైట్లతో నిర్మించిన మాల్ ను, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని అధికారులను సీఎం కోరారు. హుండీలను ఎక్కడ ఏర్పాటు చేయాలో, భక్తులు ప్రసాదం తీసుకునే కౌంటర్లు ఎక్కడ ఉండాలో అధికారులకు సూచనలిచ్చారు. బంగారు తాపడం చేసిన కళశాలు, విగ్రహాలు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యాదాద్రిలో గెస్ట్ హౌస్ లిఫ్టులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిషాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా, రిటైరైన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తినీ వెల్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

శివాలయాన్ని దర్శించిన సీఎం ఋత్విక్కుల కోసం మండపం బాగా కట్టారని కితాబిచ్చారు. క్యూ కాంప్లెక్సులో భక్తులకు ఆహ్లాదంగా వుండేలా శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లుండాలన్నారు. మెట్లదారి నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వాళ్లు నేరుగా క్యూ లైన్ కాంప్లెక్స్ చేరేలా నిర్మాణాలుండాలని అన్నారు. స్వామివారి పుష్కరిణిని పరిశీలించిన సీఎం గుండంలో స్నానం చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గుడి కింద ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏసీ ప్లాంట్ గ్యాస్ గోదాములను, కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులను, కాలికనడక నిర్మాణ పనులను కూడా సీఎం పరిశీలించారు. ఆలయ పై పరిసరాలను పరిశీలించిన అనంతరం కిందికి దిగి, గుట్ట చుట్టూ చేపట్టిన, రహదారులు, బస్ స్టాండ్, రెసిడెన్షియల్ కాటేజ్ లు, కళ్యాణ కట్ట, పుష్కరిణీ, అన్నదాన సత్రం, తదితర అభివృద్ది పనుల పురోగతిని సీఎం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

యాదాద్రి ఆలయం చుట్టూ నిర్మిత మౌతున్న రింగు రోడ్డు లోపలి పరిధిలోని పరిసర ప్రాంతాలను పచ్చదనంతో పరిపూర్ణం చేసి, దైవ భావన పరివ్యాప్తం చేయాలన్నారు. విస్తరణలో కోల్పోతున్న దుకాణందారులతో సీఎం చాలా సేపు మాట్లాడారు. వారు కోల్పోయిన దానికన్నా గొప్పగా వారికి అన్ని వసతులతో కూడిన విశాలమైన రీతిలో షోరూముల తరహాలో నూతన దుకాణాలను కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. వారికి ఉచిత ఇంటి స్థలాలను కూడా కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో గుట్ట మీద వ్యాపారాలు చేసుకున్న వారికి టెంపుల్ టౌన్ లో పాత పద్దతిలోనే దుకాణాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అక్కడి నుంచి నిర్మాణం పూర్తి కావచ్చిన ప్రెసిడేన్షియల్ సూట్ ను పరిశీలించి తుది మెరుగుల కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగిన పల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటిడిఎ ప్రత్యేక అధికారి కిషన్ రావు, ఈవో గీత, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్తపతి వేలు, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =