ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1 కోటి ఉచిత ప్రమాద బీమా.. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Launches Rs.1Cr Risk Insurance Scheme For Govt Employees

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా రూ. కోటి ప్రమాద బీమా కల్పించే మెగా పాలసీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరుల సమక్షంలో ఈ బృహత్తర పథకం కోసం దేశీయంగా ఉన్న 16 ప్రముఖ బ్యాంకులతో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఒప్పంద పత్రాలను (MoU) మార్చుకున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఉద్యోగ కుటుంబాలకు సంపూర్ణ భరోసా ఇవ్వడంతో పాటు, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన ఉద్యోగుల హక్కుల రక్షణపై ప్రభుత్వం తమ పటిష్టమైన సంకల్పాన్ని చాటింది.

పీఆర్‌సీపై మాట నిలబెట్టుకుంటాం.. సీఎం రేవంత్ హామీ

సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ.. “ఉద్యోగులుగా మీరేం ఆడుగుతారో, మీ సమస్యలు ఏంటో నాకు పూర్తిగా తెలుసు. నూతన వేతన సవరణ కమిషన్ (PRC) అమలు చేస్తామని ఎన్నికల సమయంలో మేం ఇచ్చిన మాటను వంద శాతం నిలబెట్టుకుంటాం” అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదని.. అందరం ఒకే కుటుంబమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీన కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి నుంచి, తమ ప్రభుత్వం రాగానే ఆర్థిక క్రమశిక్షణతో ప్రతినెల సక్రమంగా వేతనాలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

గంట అదనంగా పనిచేసి ఆదాయాన్ని పెంచండి

రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉద్యోగ సంఘాలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్న అక్రమార్కులను కట్టడి చేసి, పకడ్బందీగా వసూళ్లు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే బాధ్యతను ఉద్యోగులు భుజాలకెత్తుకోవాలని కోరారు. ఇందుకోసం ఉద్యోగులంతా ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు అదనంగా పనిచేయాలని సూచించారు. అక్రమాలను అడ్డుకుని రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచితే.. ఉద్యోగులు కోరిన ప్రతి ఒక్క డిమాండ్‌ను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

అడగకుండానే రూ. కోటి బీమా.. సింగరేణి తరహాలోనే అమలు

గతంలో సింగరేణి కార్మికులకు బ్యాంకర్లతో మాట్లాడి ఎలాంటి ప్రీమియం లేకుండానే రూ. కోటి ప్రమాద బీమాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజయవంతంగా అమలు చేశారని, ఇప్పటికే 45 మంది కార్మిక కుటుంబాలకు ఆ సొమ్ము అందిందని సీఎం వివరించారు. అదే స్ఫూర్తితో.. 90 శాతం మంది మధ్యతరగతి వర్గాలే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ ఉచిత బీమాను వర్తింపజేయాలని తాను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఉద్యోగులు తమ డిమాండ్ల జాబితాలో అడగకపోయినప్పటికీ, వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ముందడుగు వేసి ఈ భారీ బీమాను సాకారం చేసిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని, తమకు అయాచితంగా అంత పెద్ద ఆర్థిక రక్షణ కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు చప్పట్లతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here