ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన రెండో నేతగా ప్రధాని మోదీ

PM Modi Becomes Asia’s Second Most Effective Regional Leader Behind Chinese President Xi Jinping

ఆసియా ఖండంలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నేతల జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ థింక్‌ట్యాంక్ ‘లోవీ ఇన్‌స్టిట్యూట్’ (Lowy Institute) విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్ 2026’ నివేదిక ప్రకారం, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మొదటి స్థానంలో ఉండగా, ప్రధాని మోదీ గతసారి కంటే ఏకంగా మూడు స్థానాలు పైకి ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

అలాగే సమగ్ర శక్తి సామర్థ్యాల పరంగా ఆసియాలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ వరుసగా మూడోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియాపై ప్రభావం చూపడంలో అమెరికా (78.9 స్కోరు), చైనా (73.6 స్కోరు) ‘సూపర్ పవర్’ దేశాలుగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, 40.5 స్కోరుతో భారత్ ‘మేజర్ పవర్’ (ప్రధాన శక్తి) విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.

భారత్ తర్వాతి స్థానాల్లో జపాన్, రష్యా, ఆస్ట్రేలియా ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో పోలిస్తే భారత్‌కు ఉన్న పాయింట్ల వ్యత్యాసం 33.1 పాయింట్లకు తగ్గింది; 2018లో ఈ సూచీ ప్రారంభమయ్యాక ఇరు దేశాల మధ్య ఇంత తక్కువ వ్యత్యాసం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. వివిధ రంగాల వారీగా భారత్ సాధించిన ప్రగతిని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.

2015-24 మధ్య కాలంలో చైనాకు 53,300 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు రాగా, అంతకుమించి భారత్‌కు 55,200 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అలాగే క్రియాశీల సాయుధ బలగాల పరిమాణ సూచికలో 100కు 100 స్కోరుతో భారత్ అగ్రస్థానంలో నిలవగా, మొత్తం సైనిక సామర్థ్యంలో నాలుగో స్థానం దక్కించుకుంది. దౌత్యపరమైన ప్రభావం, రక్షణ భాగస్వామ్యాలు మరియు సాంస్కృతిక ప్రభావంలో భారత్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

మరోవైపు, లోవీ ఇన్‌స్టిట్యూట్ గణాంకాలు దేశంలో రాజకీయ చర్చకు దారితీశాయి. భారత ఆర్థిక, విదేశాంగ విధానాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఈ అంతర్జాతీయ నివేదిక చెక్ పెట్టిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన ప్రగతికి ఇది నిదర్శనమని, విదేశాల్లో దేశ ప్రతిష్టను తగ్గించేలా మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నివేదికను తప్పకుండా చదవాలని బీజేపీ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here