కేసీఆర్ మళ్ళీ వస్తే.. తెలంగాణ అంతా ఆగమాగమవుతుంది – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Slams Previous KCR Ruling at Rythu Bharosa Fund Distribution Event

కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే.. తెలంగాణ అంతా ఆగమాగమవుతుందని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి విడత కింద రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను రాబోయే తొమ్మిది రోజుల వ్యవధిలో విడతల వారీగా రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ 30 నెలల ప్రజాపాలనలో అన్నదాత సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచిందని, కేసీఆర్ చేసిన అప్పులకు గాను తమ ప్రభుత్వం రూ.2,08,557 కోట్లను బ్యాంకులకు అసలు, వడ్డీల రూపంలో చెల్లిస్తోందని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఈ రెండున్నరేళ్లలో రూ.1.56 లక్షల కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని వివరించారు.

రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని, తాజా విడతతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.36,000 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఉచిత విద్యుత్ కోసం రూ.30,000 కోట్లు, సన్న వడ్ల బోనస్ కోసం రూ.4,000 కోట్లు, రైతు బీమా కింద రూ.3,500 కోట్లు వెచ్చించామని చెబుతూ, గత పదేళ్ల భారాస పాలన కంటే తమ ప్రభుత్వం రైతులకు రెండింతలు ఎక్కువగా ఖర్చు చేసిందని గణాంకాలతో వివరించారు.

వ్యవసాయాన్ని ఒక పండుగలా తీర్చిదిద్దుతున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మారుతున్న వర్షపాత పరిస్థితులకు అనుగుణంగా రైతులు సన్న రకం వరి సాగు వైపు మొగ్గు చూపాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ రెండున్నరేళ్ల పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు సిద్ధమని ప్రతిపక్ష భారాసకు సవాల్ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here