కరోనా చికిత్సలో అధిక బిల్లులు వసూలు చేస్తే చర్యలు – మంత్రి ఈటల

Corona Treatment, Corona Treatment in Private Hospitals, Eatala Rajender, Minister Eatala Rajender, Minister Eatala Rajender Warns Private Hospitals, Prices For Corona Treatment in Private Hospitals, Private Hospitals on Corona Treatment, Telangana Health Minister Eatala Rajender

ప్రైవేట్ ఆసుపత్రులకు ఏ స్పూర్తితో అయితే కరోనా చికిత్స కోసం అనుమతి ఇచ్చామో దానిని పాటించడం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఇంకో అవకాశం ఇస్తున్నామని, సరిద్దుకొకపోతే నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తప్పవని మంత్రి ప్రకటించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాపారం చేయడం సరి కాదని, డబ్బులు సంపాదించుకోవడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది సందర్భం కాదని మంత్రి అన్నారు.

“కరోనా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని ఏర్పాట్లు చేస్తూనే, ప్రైవేటు ఆసుపత్రులతో కూడా చర్చలు జరిపాం. ఈ సమయంలో బిజినెస్ చూడవద్దని, ప్రజల్లో విశ్వాసం, ధైర్యం కల్పించాలని, సాటి మనిషికి ఆపన్నహస్తం ఇవ్వాలని కోరాం, కానీ అలా కాకుండా లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే తప్ప చేర్చుకొకపోవడం, రోజుకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేయడం, మనిషి చనిపోతే డబ్బులు చెల్లించే వరకు శవం ఇవ్వకపోవడంపై ఇప్పటికే వచ్చిన పలు ఫిర్యాదులను కమిటీని వేసి సమగ్ర విచారణ జరుపుతున్నాం. పద్ధతి మార్చుకోవాలని మరోమారు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇప్పటికే ఒక ఆసుపత్రి మీద చర్యలు తీసుకున్నం, మిగిలిన ఆసుపత్రుల మీద కూడా చర్యలకు తీసుకుంటాం. అయితే ప్రైవేట్ ఆస్పత్రులను మూసి వేయడం తమ ఎజెండా కాదని, ప్రజలకు సేవ చేయాలని మరో మారు విజ్ఞప్తి చేస్తున్నామని” మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

అలాగే ప్రజలు భయపడిపోయి ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయవద్దని మంత్రి కోరారు. ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేసుకోవచ్చని అన్నారు. జ్వరం, జలుబు, దగ్గు వచ్చిన వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. జ్వరమే కదా అని ఇంట్లో ఉండవద్దు. అలా ఉన్నవారికి శ్వాస సంబంధ ఇబ్బంది వస్తే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే త్వరగా గుర్తించడం అవసరం అని మంత్రి సూచించారు. తక్కువ ఖర్చుతో కరోనాకి చికిత్స అందించవచ్చు. డెక్సామితాజోన్ లాంటి మందులు ఉపయోగిస్తే వెయ్యి రూపాయలు కూడా ఖర్చు కాదని మంత్రి తెలిపారు. ఒకవేళ ఆక్సిజన్ అవసరం అయినా కూడా 10 రోజులకు 2500 రూపాయలు మాత్రమే అవుతాయి కాబట్టి ప్రజలు బెంబేలెత్తి పోవద్దని సూచించారు. మామూలు రోగుల వద్ద ఉన్నట్టు కరోనా వారి పక్కన సాయం అందించడానికి ఎవరూ ఉండరు, ఓదార్చే వారు ఉండరు, ఒంటరి అయ్యానని బెంగతోనే చాలా మంది చనిపోతున్నారు. భయపడకుండా ముందుగా చికిత్సకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆలస్యం అయితే స్పాంజ్ లాగా ఉండాల్సిన ఊపిరితిత్తులు రాయి లాగా మారిపోతున్నాయి. అలాంటప్పుడు ఎంత ఆక్సిజన్ ఇచ్చినా నిష్ప్రయోజనమని మంత్రి అన్నారు.

మరోవైపు చనిపోయిన వారి శవాలను ఊర్లలోకి తీసుకురావద్దని కూడా చాలా మంది అభ్యంతరం చెప్తున్నారు. అయితే శవాల వల్ల వైరస్ సొకదు అన్నారు. అలా సోకేది ఉంటే శవాలను చుట్టే వాళ్ళకి, తరలిస్తున్న వారికి, ఖననం చేస్తున్నవారికి వైరస్ సోకి ఇబ్బంది పడాల్సి ఉండేది. ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా, మెడికల్ కాలేజ్ అన్నింటిలో కూడా ఉచితంగా కరోనా చికిత్స ను అందిస్తున్నాము. ఆర్విఎం మెడికల్ కాలేజ్, ఎమ్మెన్నార్, మమత, మల్లారెడ్డి, కామినేని మెడికల్ కాలేజీలో సేవలు అందుబాటులో ఉన్నాయి. బెడ్స్ కి, ఆక్సిజన్ కి, ఐసీయూ లకు కొరతలేదు. పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే బ్రతుకుతాము, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే బ్రతకము అనే భావన తప్పని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు చనిపోయే స్టేజ్ లో ఉన్న వారిని, డబ్బులు లేని వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారని అలా చేయడం సరికాదని అన్నారు.

లక్షణాలు లేని వారు పరీక్షల కోసం క్యూలు కట్టి అవసరమైన వారికి కిట్స్ అందుబాటులో లేకుండా చేయవద్దు. కిట్స్ ఇప్పుడు గ్రామస్థాయి వరకు అందుబాటులోకి వెళ్లాయి. భయపడి మాత్రం పరీక్షల కోసం రావద్దు. రాపిడ్ పరీక్షల కంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలతో కరోనా నిర్ధారణ జరుగుతుంది. సీఎం కేసీఆర్ కరోనాపై పోరాటంలో పూర్తి స్థాయిలో మద్దతుగా ఉన్నారు. అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తుంది. గాంధీ ఆసుపత్రిలో రెండువేల బెడ్స్ లో 1100 బెడ్స్ కి ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఇవన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్, సరోజినీ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వచ్చి చికిత్స పొందుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆన్ డ్యూటీ గానే పరిగణిస్తాము. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ కేసులు పూర్తి స్థాయిలోకి వెళ్లి తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో గ్రామాల్లో కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =