వరంగల్ లో నాలాలపై ఆక్రమణలు నెలరోజుల్లో తొలగిస్తాం, తక్షణ సాయం కింద రూ.25 కోట్లు

Flood Situation in Warangal, Heavy Rains In Telangana, KTR, KTR Visits Warangal City to Monitor Rains, Minister KTR, Minister KTR Review Meeting, Minister KTR Visits Warangal City, telangana, Telangana CM KCR, Telangana Floods Live Updates, Telangana rains, telangana rains news, telangana rains updates, Warangal Floods, Warangal Rains

వరంగల్ నగరంలో రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీని మంత్రి నియమించారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జరిగిన నష్టంపై అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం వరంగల్ నగరంలో పర్యటించిన కెటి రామారావు నిట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

‘‘నగరంలో పర్యటించిన సందర్భంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విషయం చెప్పారు. నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని చెప్పారు. వారి చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి. వాటిని తక్షణం తొలగించాలి. ఈ విషయంలో రాజీ పడేది లేదు. రాజకీయ వత్తిళ్లు ఉండవు. పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించండి. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పని వెంటనే ప్రారంభం కావాలి. ఇంకా నీటి ప్రవాహాలు వెళ్లే నాలాలకు ఏమైనా అడ్డంకులున్నాయా అనే విషయం పరిశీలించాలి. నాలాలపై ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే పని చేయడానికి కలెక్టర్ చైర్మన్ గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నాం. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఎయుడి కమిషనర్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారు. వీరిద్దరిలో ఒకరు ప్రతీ వారంలో ఒక రోజు వరంగల్లో పర్యటిస్తారు. నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలి. అవి అక్రమ నిర్మాణాలైతే నిర్ధాక్షిణ్యంగా తొలగించాలి. పేదల ఇండ్లయితే, వారికి ప్రభుత్వం తరుఫున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి తొలగించాలి. ఏదేమైనా సరే, మొత్తం నాలాలపై ఆక్రమణలు తొలగించాలి. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తూనే, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా వాటికి ప్రహారీ గోడలు(రిటైనింగ్ వాల్స్) నిర్మించాలి. ఎస్ఆర్ఎస్పి కాలువ ఆక్విడక్ట్ వద్ద కూడా పూడిక తీయాలి’’ అని మంత్రి కేటీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

‘‘వరంగల్ నగరంలో నాలాలాపై ఆక్రమణలు ఇప్పుడు వచ్చినవి కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్న తంతు. గతంలో ఇండ్ల నిర్మాణం, లే అవుట్లు, రోడ్ల నిర్మాణం ఓ పద్దతి ప్రకారం జరగలేదు. ఇకపై అలా జరగదు. అన్నీ పక్కాగా జరుగుతాయి. పద్దతి ప్రకారం నగరాభివృద్ది జరగాలనే ఉద్దేశ్యంతోనే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాం. దానికి తోడు వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమయింది. ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలోనే దాన్ని ప్రకటిస్తాం. ఈ రెండింటితో పాటు కొత్తగా టిఎస్-బి పాస్ కూడా వచ్చింది. ఈ చట్టాలు, విధానాలు, ప్రణాళికలకు అనుగుణంగా వరంగల్ లో ఇకపై నిర్మాణాలుండాలి. నగరం ఎటు పడితే అటు, ఎట్ల పడితే అట్ల అన్నట్లు కాకుండా ఓ పద్ధతి ప్రకారం అభివృద్ది కావాలి. ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు జరగాలి’’ అని మంత్రి కేటీఆర్ వివరించారు.

‘‘వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉన్నాయి. వరంగల్ లో భారీ వర్షాలు, వరదలు అనే సమాచారం సీఎంకు ఎంతో ఆందోళన కలిగించింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ దెబ్బతినకూడదని భావించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఏమాత్రం ప్రాణనష్టం కలగకుండా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు వరంగల్ నగరంలో 20 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాలకు చెందిన 4,500 మందికి ఆశ్రయం కల్పించాం. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బోట్లు, పరికరాలతో సహా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను పంపాం. వారంతా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సోమవారం స్వయంగా వరంగల్ రావాలనుకున్నారు. కానీ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో మానుకున్నారు. ఇవాళ మమ్మల్ని ప్రత్యేకంగా పంపించారు. ఇక్కడి పరిస్థితిని చూసి, సీఎంకు నివేదించాం. తక్షణ అవసరాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత ఎన్ని నిధులు కావాలన్నాఇస్తామని చెప్పారు. కాబట్టి అధికారులు జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలి’’ అని కేటీఆర్ చెప్పారు.

‘‘వరంగల్ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలయింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలి. పారిశుద్య పనుల్లో యాంత్రీకరణ జరగాలి. స్వీపింగ్ మిషన్ల ద్వారా నగరంలో పరిశుభ్రతను కాపాడాలి. ప్రస్తుతం కురిసిన వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడం, ముంపుకు గురైన వారికి అవసరమైన సాయం అందించడం తక్షణ కర్తవ్యంగా అధికారులు భావించాలి. ముంపుకు గురైన వారికి ప్రభుత్వం పక్షానే నిత్యావసర సరుకులు అందించాలి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగవద్దు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలి. నిర్మాణంలో ఉన్న భవనాల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి’’ అని కేటీఆర్ సూచించారు.

టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు:

వరంగల్ నగరంలో నాలాలపై ఆక్రమణలు తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు చైర్మన్ గా, పోలీస్ కమిషనర్ కో చైర్మన్ గా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్ఇ, వరంగల్ అర్బన్ ఆర్డీవో, నేషనల్ హైవేస్ అథారిటీ ఎస్ఇ సభ్యులుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీనీ నియమిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =