రాజ‌కీయ “సంఘ‌ర్ష‌ణ‌”లో రాముల‌మ్మ

Ramulamma in the political conflict,Ramulamma in the political,political conflict,Mango News,Mango News Telugu,bjp, Telangana Assembly Elections, Telangana Politics, Vijayashanti,Telugu actress Vijayashanti,Vijayashanthis political career,Vijayashanti Latest News,Vijayashanti Latest Updates,Vijayashanti Live News,Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana News Today

ఇర‌వై అయిదేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 25 సంవత్సరాల తన రాజకీయ ప్రయాణం అప్పుడు.. ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే తనకు ఇస్తూ వచ్చిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ పదవి ఏనాడూ కోరుకోలేద‌ని.. ఇప్పటికీ కావాలని అనుకోవడం లేదని రాములమ్మ తెలిపారు. వాటిని ప‌రిశీలిస్తే ఆమె రాజ‌కీయంగా ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌క సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌వుతున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. సొంత పార్టీతో పాటు.. అన్ని పార్టీలనూ చుట్టేసిన విజ‌య‌శాంతి ఇప్పుడు రాజ‌కీయంగా ఎటూ వెళ్ల‌లేక‌.. ఉన్న‌దాంట్లో సంతృప్తి లేక స‌త‌మ‌తం అవుతున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

రాములమ్మగా సినిమాల్లో రాణించిన విజ‌య‌శాంతి రాజకీయాల్లో ఎందుకో రాణించలేకపోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సొంత పార్టీతో వచ్చిన ఈమె అప్పటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తో కలిసిపోయారు. కేసీఆర్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. కేసీఆర్ ముద్దుల చెల్లిగా మారి.. టీఆర్ఎస్ లో నంబర్2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఈమెను కేసీఆర్ ఎంపీని చేసి ఢిల్లీకి కూడా పంపించారు. అయితే కేసీఆర్ తో విభేదాలు.. పొసగక పోవడంతో రాములమ్మ బయటకు వచ్చారు. అనంతరం కేసీఆర్ ను తిడుతూ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెసోళ్లు కూడా బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రచార కమిటీ చైర్మన్ చేశారు. రాములమ్మ కోరిక మేరకు గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటు కూడా ఇచ్చారు. అయినా ఎన్నికల్లో గెలవలేకపోయింది.

ప్రచార కమిటీ చైర్మన్ ను చేసినా తనను పట్టించుకోవడం లేదని నాడు కాంగ్రెస్ పై అలకబూనారు. ప్రొటోకాల్ లొల్లి మొదలుపెట్టారు. రాములమ్మ కాంగ్రెస్ ఇమడలేరని అర్థం కావడంతో ఆ నాయకులు పట్టించుకోలేదు. చివరకు బీజేపీ నేతలు గాలం వేసి విజయశాంతిని బీజేపీలో చేర్చుకున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా మొదట్లో బాగానే విజయశాంతిని నెత్తిన పెట్టుకుంది. కానీ తర్వాత నేతలంతా బిజీ అయిపోయారు. బండి సంజయ్ ఉన్న‌ప్పుడు.. ఆ త‌ర్వాత కూడా త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గిన‌ట్లుగా ఆమె ఫీల‌వుతూ వ‌స్తున్నారు. బీజేపీ నాయకత్వంపై అలకబూనారు. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనడంపై ఆమె బహిరంగంగానే అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్న వ్యక్తితో కలిసి స్టేజ్ పంచుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని విజయశాంతి మీడియాకు చెప్పారు.

కొంత కాలంగా బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని విజయశాంతి బాధపడుతున్నారు. పాత నాయకులు పార్టీలో పాతుకొని పోగా.. కొత్తగా వచ్చిన నాయకులకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తనను పూర్తిగా పక్కన పెట్టారని విజయశాంతి భావిస్తున్నారు. కేవలం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాకతోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోలేదని.. తన అసంతృప్తిని బయటపెట్టడానికి సమయం కోసం వేచి చూసి.. ఆ రోజు మీడియా ముందు వ్యాఖ్యలు చేశారని అప్ప‌ట్లో భావించారు. ఇప్పుడు మ‌రోసారి త‌న అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టారు. 25 సంవత్సరాల తన రాజకీయ ప్రయాణంలో సంఘ‌ర్ష‌ణే మిగిలింద‌న్నారు. అంతేకాదు.. మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇవాల్టి బీఆర్ఎస్‌కు వ్యతిరేకం అవుతామని కాదన్నారు. తన పోరాటం నేడు ఒక కుటుంబ దోపిడీ, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప.. తనతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని విజయశాంతి పేర్కొన‌డం కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ క్ర‌మంలో రాజ‌కీయంగా సంఘ‌ర్ష‌ణ‌కు గుర‌వుతున్న ఆమె మున్ముందు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న ఆస‌క్తి ఏర్ప‌డింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − four =