317 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ, వేలాది నేతన్నలకు ఉపాధి : మంత్రి కేటిఆర్

Minister KTR Participated in Bathukamma Sarees Presentation Program

బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంతో జరుపుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు 99 లక్షల చీరలను సిద్ధం చేశారు. త్వరలో మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయనున్న ఈ బతుకమ్మ చీరలను నేడు హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హరిత హోటల్ లో రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో టెస్కో డైరెక్టర్ శైలజా రామఅయ్యర్ ప్రదర్శించారు. 287 డిజైన్లతో, అనేక వర్ణాలతో కూడిన చీరలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండగకు రాష్ట్ర మహిళలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

“సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన సమస్యల పట్ల దృష్టి సారించి, దీర్ఘకాలిక పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాలు కోసం మొదటి నుంచి ప్రయత్నించామని మంత్రి కేటిఆర్ అన్నారు. సీఎం కేసిఆర్ గతంలో కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆనాడు సిరిసిల్ల ప్రాంతంలో గోడలమీద రాతలు ఉండేవి. నేతన్న, ధైర్యంతో ఉండు, మరణించవద్దు, ఆత్మహత్యలు మంచిది కాదు అని ఆనాటి ప్రభుత్వం గోడల మీద రాయించింది. ఆనాడు ఆ పరిస్థితి చూసి సీఎం కేసీఆర్ చలించారు. ఒకరోజు సిరిసిల్లలో ఏడుగురు నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆనాడు ఉద్యమ నాయకునిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పార్టీ తరపున 50 లక్షల రూపాయలను నేతన్నల సమాజానికి సంబంధించిన సొసైటీకి ఇచ్చి మైక్రో రుణాలు ఇవ్వమన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసిఆర్ నేతన్నల సమస్యలు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా, ఆ ప్రాంత సమస్యలు గుర్తెరిగిన వ్యక్తిగా 1200 కోట్ల రూపాయల బడ్జెట్ ను చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చేనేత, జౌళి శాఖకు ఇచ్చి మాకు చాలా కార్యక్రమాలు డిజైన్ చేసి మార్గనిర్ధేశనం చేశారని” మంత్రి కేటిఆర్ అన్నారు.

“సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ ప్రాంతాల్లో పవర్ లూమ్స్ కు చేతినిండ పనికల్పిస్తే నేతన్నకు ఢోకా ఉండదని, ఇవాళ 10,12వేలు సంపాదించే నేతన్నమనం భద్రత ఇచ్చి, ఉపాధి కల్పిస్తే మార్కెట్ గ్యారంటీ కల్పిస్తే 8వేలు సంపాదించే వారు 20వేలు సంపాదిస్తారు, 15వేలు సంపాదించేవారు 25వేలు సంపాదిస్తారని ఒక ఆలోచనతో అక్కడి వ్యాపారులను పిలిపించి, నేతన్నలకు జీతం పెరిగి లాభం జరిపేందుకు ఒప్పుకుంటేనే ఈ ఆర్డర్ ఇస్తానని చెప్పి ఒప్పించారు. ప్రతి సంవత్సరం కోటి చీరలు అందించాలని చేనేత, జౌళి శాఖకు లక్ష్యం పెట్టారు. రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలకు చిరు కానుకగా నాణ్యమైన చీరను బతుకమ్మ పండగకు అందించాలని, తద్వారా నేతన్నకు ఉపాధి కల్పించాలని చెప్పారు. 2017లో 228 కోట్ల రూపాయలు, 2018లో 280 కోట్ల రూపాయలు, 2019లో 313 కోట్ల రూపాయలు, 2020 లో 317.81 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఒక్క బతుకమ్మ చీరలమీదనే 1033 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. 26వేల పవర్ లూమ్స్ కు పనికల్పిస్తూ వేలాది నేతన్నలకు ఉపాధి కల్పిస్తోందని” మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

“నాలుగేళ్లలో నాలుగు కోట్ల చీరలను ఇప్పటికే పంపిణీ చేసింది. కేవలం బతుకమ్మ చీరలే కాదు విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్ పెద్ద మొత్తంలో పవర్ లూమ్స్ కే ఇస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ డిపార్ట్ మెంట్ నుంచి అంగన్ వాడీలు, ఐసిడిఎస్ లో పనిచేసే ఇతర సిబ్బంది చీరలు, కేసీఆర్ కిట్ లో ఇచ్చే చీరలన్నీ కూడా పవర్ లూమ్స్ కు ఆర్డర్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలనేవి గత చేదు అనుభవంగా, పీడకలలా మిగిలిపోయింది. రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలు నేడు లేవు. మౌలిక అంశాల మీద రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఏరకమైన పరిష్కారాలు వస్తాయనేదానికి ఈ రోజు తెలంగాణనే మంచి ఉదాహరణ. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. రైతు ఆత్మహత్యలను అత్యంత వేగంగా తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోను ఊటంకిస్తూ చెప్పింది. రైతన్న ఆత్మహత్యలు లేవు, నేతన్న ఆత్మహత్యలు లేవు, ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తొలగించిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది. ఢిల్లీలో మాకు అనుకూల ప్రభుత్వం లేదు. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు. అయినా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి వారిది. బతుకమ్మ చీరల కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు సిరిసిల్ల పవర్ లూమ్స్ అవుట్ డేటెడె లూమ్స్, ముతక చీరలకే పనికొస్తాయి. మంచి నాణ్యత ఉన్న చీరలు ఏ విధంగా నేయాలని మథనపడ్డాము. కానీ నేతన్నలతో మాట్లాడి పవర్ లూమ్ అప్ గ్రెడేషన్ స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ వేల సంఖ్యలో లూమ్స్ అప్ గ్రేడ్ చేశాము. దీనివల్ల నాణ్యమైన చీరలు అనేక డిజైన్లలో చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు నేడు ఇతర రాష్ట్రాలలో కూడా మన నేతన్నలు ఆర్డర్లు పొందుతున్నారు” అని మంత్రి కేటిఆర్ అన్నారు.

“ఈ రాష్ట్రంలో నేతన్న భవిష్యత్ భద్రంగా ఉంటుంది. చేనేత మిత్ర పథకమైనా, నేతన్నకు చేయుత పథకమైనా, నూలు,,రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా ఇవన్నీ తెలంగాణలోనే జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి మతపరమైన ఎజెండా లేదు. రంజాన్, క్రిస్మస్ లకు కూడా చీరలు ఇస్తున్నాం. మతం ఏదైనా పండగే. పేదరికం అన్ని మతాల్లోనూ ఉంది కాబట్టి అన్ని మతాల పండగలకు చీరలు ఇస్తున్న గొప్ప సంస్కార ప్రభుత్వం తెలంగాణది. మన రాష్ట్రంలో మహిళా సంఘాలు బలంగా ఉన్నాయని చీరల పంపిణీ వారికే బాధ్యత ఇచ్చాము. వచ్చే ఏడాది ఇంతకన్నా ఉత్సాహ పూరిత వాతావరణం లో ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము. కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి ఆగలేదు. రైతుకు రైతుబంధు రూపంలో 7279.58 కోట్లు రైతు అకౌంట్ లో పడ్డాయి. రైతుబీమా 1141 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఆసరా పెన్షన్లకు ప్రతి నెల దాదాపు 1000 కోట్లు ఇస్తున్నాం. కళ్యాణలక్మీ, షాదీ ముబారక్, పిల్లల స్కాలర్ షిప్ లు ఆగలేదు. బతుకమ్మ చీరలు ఆగలేదు. రంజాన్, క్రిస్మస్ ఆగవు. సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేక కృతజ్ణతలు. బతుకమ్మ చీరలకు బ్రాండింగ్ చేయండి. బయట కూడా వీటిని కొంటారు. ఇంత నాణ్యమైన చీరలు తక్కువ ధరకే లభిస్తున్నాయి” అని మంత్రి కేటిఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =