భాగ్యనగరానికి తలమానికంగా మారబోతున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ (Musi Riverfront Project) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్‌ను ఆవిష్కరించారు. మూసీ నది అభివృద్ధి, దాని చుట్టూ నిర్మించబోయే సుందరీకరణ పనులపై శుక్రవారం సాయంత్రం తాజ్ కృష్ణా హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇచ్చారు.
లండన్ థేమ్స్ నది తరహాలో.. లండన్ లోని థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నది మురికి కూపంగా మారిందని, దానిని ప్రక్షాళన చేయకుంటే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజెంటేషన్ లోని ముఖ్య అంశాలు:
-
నదీ ప్రక్షాళన: మురుగు నీరు మూసీలో కలవకుండా అత్యాధునిక ఎస్టీపీ (STP)ల నిర్మాణం.
-
ఎకనామిక్ జోన్: నదికి ఇరువైపులా ప్రపంచ స్థాయి వాణిజ్య, వ్యాపార సముదాయాల ఏర్పాటు.
-
పర్యాటక ఆకర్షణ: వాటర్ ఫ్రంట్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్స్ మరియు పిల్లల వినోద కేంద్రాల నిర్మాణం.
-
నిర్వాసితులకు భరోసా: మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలకు ఇబ్బంది కలగకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
- రాజకీయ విమర్శలకు చెక్: ఈ ప్రాజెక్ట్ కేవలం రియల్ ఎస్టేట్ కోసం కాదని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా నిలబెట్టే ప్రయత్నమని సీఎం పేర్కొన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, నగరాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. దాదాపు 55 కిలోమీటర్ల మేర ఈ పునరుజ్జీవన పనులు జరగనున్నాయని, దీనివల్ల వేల కోట్లలో ఆదాయం మరియు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..?
- హైదరాబాద్ నగర నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న సంకల్పంతో, మురికి కూపంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలన్న గొప్ప తలంపుతో, మూసీ దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కాలుష్య వెతలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న మానవత్వంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “మూసీ పునరుజ్జీవం – రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్” ప్రాజెక్టు తలపెట్టింది.
- ఈ ప్రాజెక్టు పై కొందరు వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాం.
- ప్రముఖులు, పర్యావరణవేత్తలు, మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల సమక్షంలో ప్రభుత్వ విజన్ ను, వాస్తవ అంశాలను స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించాం.
- ఈ రోజు “MUSI INVITES” పేరుతో
కార్యక్రమం నిర్వహించి మా ఆలోచనను సమాజం ముందు పెట్టాం. మూసీ పునరుజ్జీవం ఇప్పుడు ఛారిత్రక అవసరం. మా ప్రభుత్వం ప్రజలను నొప్పించి, పేదలను ఇబ్బంది పెట్టి ఏ పని చేయదు. - ప్రతి అభివృద్ధి వెనుక కొంత మందికి ఇబ్బంది కలగడం సహజం. ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆ పరిష్కారం పై ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి మేం సిద్ధం.
- మూసీ పరీవాహకంలో మురికి వాడల్లో పేదలు ఆత్మగౌరవాన్ని వదులుకుని బతకాలా!? వారు స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించాలన్నది మా ఆకాంక్ష. నది పునరుజ్జీవనంతో పాటు, పేదలకు ఆత్మగౌరవంతో కూడిన పునరావాసం కల్పించడానికి సిద్ధం గా ఉన్నాం.
- మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
- అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్ప, ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు అనేది మా ప్రభుత్వం నమ్ముతుంది.
- చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్ కు ప్రణాళికలు వేసుకోవడం విజ్ఞుల లక్షణం. మూసీ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం.” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు పలు రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.








































