అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచి, తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ దీవి, చమురు బావులు మరియు విద్యుత్ కేంద్రాలను సర్వనాశనం చేస్తామని సోమవారం హెచ్చరించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ హెచ్చరికలు
-
ఖార్గ్ దీవిపై కన్నేసిన అమెరికా: ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఖార్గ్ దీవిని, డీశాలినైజేషన్ (మంచినీటి) కేంద్రాలను పేల్చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. 47 ఏళ్లుగా అమెరికన్ సైనికుల మరణాలకు ఇది ప్రతీకారమని ఆయన పేర్కొన్నారు.
-
ఒప్పందానికి మొగ్గు: ఇరాన్‌లో కొత్త ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంకేతంగా ఇరాన్ 20 పాకిస్థానీ చమురు నౌకలను హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించిందని వెల్లడించారు.
-
మొజ్తబా ఖమేనీ సందేశం: సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ క్షేమ సమాచారంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, ఆయన ఆదివారం ఒక సందేశాన్ని విడుదల చేశారు. యుద్ధ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు, మతగురువులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా బేస్‌ల తరలింపు?
గల్ఫ్ దేశాలైన ఖతార్, బహ్రెయిన్, యూఏఈలలోని అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఈ నేపథ్యంలో, ఆ సురక్షితం కాని బేస్‌లన్నింటినీ తమ దేశానికి తరలించాలని ఇజ్రాయెల్ అమెరికాను కోరింది. ఒకవేళ అమెరికా ఇందుకు అంగీకరిస్తే, ఇజ్రాయెల్‌కు సైనిక పరంగా మరింత పటిష్టమైన భద్రత లభిస్తుంది.
అణు కేంద్రం ధ్వంసం:
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) నివేదిక ప్రకారం, ఇరాన్‌లోని భారజల కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. దీనిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అవకాశాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు, తమ దేశ వ్యవహారాల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోబోమని ఇరాన్ తేల్చి చెప్పింది.






































