జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల (Asian Games) కోసం భారత మహిళల క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో నాయకత్వ మార్పుపై అనేక అంచనాలు వెలువడినప్పటికీ, సెలక్టర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ వైపే మొగ్గు చూపారు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలోనూ ఆమె జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనుండగా, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. చైనాలోని గ్వాంగ్‌జౌలో 2023లో జరిగిన గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
సెలెక్షన్ కమిటీ ప్రకటించిన ఈ 15 మంది సభ్యుల జట్టులో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, వికెట్ కీపింగ్ విభాగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ వికెట్ కీపర్, బ్యాటర్ యాస్తికా భాటియాను పక్కన పెట్టి, ఆమె స్థానంలో జి.కమిలినిని బ్యాకప్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జట్టులోని ఇతర సీనియర్ ఆటగాళ్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
జట్టు బ్యాటింగ్ విభాగాన్ని పరిశీలిస్తే షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి పవర్‌ఫుల్ హిట్టర్లు బలాన్ని చేకూరుస్తుండగా, ఆల్‌రౌండ్ విభాగంలో దీప్తి శర్మ కీలక పాత్ర పోషించనుంది. బౌలింగ్ విభాగంలో పేస్ బాధ్యతలను రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతీ రెడ్డి పంచుకోనుండగా, స్పిన్ విభాగంలో రాధా యాదవ్, శ్రీచరణి ప్రత్యర్థులను కట్టడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఇక గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన యువ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌ను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఆమె ఆసియా క్రీడల బరిలో నిలవడం అనేది పూర్తిగా ఫిట్‌నెస్ నిరూపించుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. యువ ఆటగాళ్లతో కూడిన ఈ సమతుల్యమైన జట్టు ఆసియా వేదికపై మరోసారి భారత్‌కు పసిడి పతకాన్ని అందిస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా గేమ్స్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీచరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతీ రెడ్డి, రాధా యాదవ్, నందిని శర్మ, శ్రేయాంక పాటిల్*.






































