ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యావ్యవస్థ బలోపేతానికి విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని, అలాగే సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ‘షైనింగ్ స్టార్స్’ అని అభివర్ణిస్తూ, ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే బ్రాండ్ అంబాసిడర్లుగా వారిని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల గౌరవాన్ని, ప్రతిష్టను పునరుద్ధరించడంలో విద్యార్థుల కష్టం ఎంతో ఉందని మంత్రి కొనియాడారు.
వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం రెండు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారేలా విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని, జూలై నెలలో భారీ స్థాయిలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని (మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్) నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తోందని, ఈ పెట్టుబడికి తగ్గట్టుగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ‘వన్ క్లాస్, వన్ టీచర్’ విధానం, తల్లీకి వందనం పథకం, రాగి జావ, మిల్లెట్ చిక్కీల పంపిణీ మరియు ‘నో బ్యాగ్ డే’ వంటి విద్యా సంస్కరణలు పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని 72.8% నుండి 78.39%కి పెంచడానికి ఎంతో దోహదపడ్డాయని వివరించారు.
యువత కేవలం విద్యా ఉద్యోగ రంగాలకే పరిమితం కాకుండా, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కావడానికి రాజకీయాలను ఒక వేదికగా ఎంచుకోవాలని సూచించారు. సమాజంలో గుణాత్మక మార్పులు సాధించడంలో యువతరం ఆలోచనలు, వారి క్రియాశీలక పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా పదో తరగతిలో ప్రతిభ చూపిన 55 మంది విద్యార్థులకు రూ. 30,000 నగదు బహుమతితో పాటు పతకాలు, ధృవీకరణ పత్రాలను అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 61 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు, మెడల్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ రంజిత్ బాషా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




































