భారత్, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల అధికారిక పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఇండోనేసియా రాజధాని జకార్తాకు చేరుకున్నారు.
ఈ క్రమంలో జకార్తా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అక్కడ అత్యంత ఘనస్వాగతం లభించింది. ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి భారత ప్రధానికి సాదర స్వాగతం పలికారు.
అధ్యక్షుడితో పాటు ఇండోనేసియా ప్రభుత్వానికి చెందిన నలుగురు కీలక మంత్రులు కూడా ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి తరలివచ్చారు. దేశాధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలకడంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేస్తూ, ఈ అపూర్వ గౌరవం తనను ఎంతో హత్తుకుందని పేర్కొన్నారు.
Thank you for the warm welcome at the Istana Merdeka! @prabowo pic.twitter.com/U6uLbk7aCr
— Narendra Modi (@narendramodi) July 7, 2026
ఎఫ్-16, సుఖోయ్-30 విమానాల ప్రత్యేక ఎస్కార్ట్
భారత ప్రధాని పర్యటనకు ఇండోనేసియా ప్రభుత్వం కల్పించిన వినూత్న స్వాగత మర్యాదలు అంతర్జాతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేసియా గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశ వైమానిక దళానికి చెందిన అమెరికా తయారీ ‘ఎఫ్-16’, రష్యా తయారీ ‘సుఖోయ్-30’ యుద్ధ విమానాలు రక్షణ ఎస్కార్టుగా నిలిచాయి.
రెండు విభిన్న అగ్రరాజ్యాల సాంకేతికతకు చెందిన యుద్ధ విమానాలు ఏకకాలంలో భారత ప్రధాని విమానానికి ఎస్కార్ట్‌గా ప్రయాణించి జకార్తా విమానాశ్రయం వరకు తీసుకురావడం దౌత్యపరంగా ఒక అరుదైన గౌరవంగా నిలిచింది. 2018లో తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచిన తర్వాత మోదీ ఇండోనేసియాలో జరుపుతున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం గమనార్హం.
Highlights from a very special welcome in Jakarta last evening…looking forward to the talks with President Prabowo Subianto today.@prabowo pic.twitter.com/Zj4xfqCsqR
— Narendra Modi (@narendramodi) July 7, 2026
రామాయణ ప్రదర్శన.. ప్రవాస భారతీయుల కోలాహలం
విమానాశ్రయం నుంచి జకార్తాలోని హోటల్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రవాస భారతీయ సంఘాల సభ్యులు ఘనమైన స్వాగతం పలికారు. “మోదీ, మోదీ”, “భారత్ మాతా కీ జై” అనే నినాదాలతో హోటల్ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భంగా ప్రధాని గౌరవార్థం ప్రవాస భారతీయులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా భారతదేశం, ఇండోనేసియా మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబించేలా ఇండోనేసియా సంప్రదాయ షాడో పప్పెట్రీ (తోలుబొమ్మలాట) గ్రూప్ ‘వాయాంగ్ కులిత్’ ప్రదర్శించిన రామాయణ ఇతివృత్త ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
The performance of ‘Homage to the Triple Gem’, by the artistes of the Vihara Dharma Ratna Group, was exceptional. It reflected the timeless teachings of Lord Buddha and the profound values embodied in the Triple Gem. It is heartening to see the rich Buddhist heritage being… pic.twitter.com/4KAP3rnXGT
— Narendra Modi (@narendramodi) July 6, 2026
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు యోగ్యకర్తలోని చారిత్రాత్మక యునెస్కో గుర్తింపు పొందిన ‘ప్రాంబనన్’ దేవాలయ సముదాయాన్ని కూడా సందర్శించనున్నారు. ఇండోనేసియా పర్యటన ముగిసిన అనంతరం బుధవారం ఆయన ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్ దేశాలలో పర్యటించనున్నారు.






































