ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. ప్రాణాంతకమైన వ్యాధితో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నిరంజన్ ఆరోగ్య పరిస్థితి ఇటీవల మరింత క్షీణించడంతో, తల్లిదండ్రులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆ బాలుడు మృతి చెందాడు.
పవన్ కల్యాణ్‌ను కలవాలనే తన ఆఖరి కోరిక తీరిన కొద్ది రోజులకే నిరంజన్ మరణించడం పవన్ కల్యాణ్ అభిమానుల్లోనూ, హనుమకొండ పరిసర ప్రాంతాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.
నెల రోజుల క్రితమే నెరవేరిన ఆఖరి కోరిక
చిన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన నిరంజన్, ఏడేళ్ల వయసు వరకు సాధారణంగానే ఉన్నాడు. ఆ తర్వాత ‘డ్యూచెస్ మస్కులర్ డిస్ట్రోఫీ’ (DMD) అనే తీవ్రమైన జన్యు సంబంధిత కండరాల క్షీణత వ్యాధి బారిన పడ్డాడు. ఈ ప్రాణాంతక వ్యాధి వల్ల బాలుడి ఎదుగుదల క్రమంగా ఆగిపోవడంతో పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.
తన జీవిత కాలం తక్కువని తెలిసిన నిరంజన్, ఎలాగైనా పవన్ కల్యాణ్‌ను ఒకసారి కలవాలని ఉందని తన తల్లిదండ్రులకు ఆఖరి కోరికగా చెప్పాడు. సోషల్ మీడియా వీడియోల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి, గత నెల 18వ తేదీన స్వయంగా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లారు.
చేతిని ముద్దాడి ధైర్యం చెప్పిన జనసేనాని
మంచంపై కదలలేని స్థితిలో ఉన్న నిరంజన్‌ను చూసి పవన్ కల్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. ఆ మంచంపైనే నిరంజన్ పక్కన కూర్చుని, బాలుడి చేతిని ఎంతో ఆప్యాయంగా ముద్దాడి, ‘ఎలా ఉన్నావు నిరంజన్?’ అంటూ ఆత్మీయంగా పలకరించారు.
‘అధైర్యపడకు.. మంచి వైద్యం అందిస్తే తప్పకుండా కోలుకుంటావు’ అని ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి వెళ్లే ముందు జనసేన డైరీపై తన స్వదస్తూరితో “ప్రియమైన నిరంజన్.. ప్రేమతో.. ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ..” అని ప్రత్యేక సందేశం రాసి ఇచ్చారు. తన అభిమాన నాయకుడిని కలిసి నెల రోజులు కూడా కాకముందే నిరంజన్ శాశ్వతంగా లోకాన్ని విడిచివెళ్లడం అందరినీ కలచివేస్తోంది.







































