రాజకీయ రంగప్రవేశంపై జోరుగా ఊహాగానాలు.. స్పష్టత ఇచ్చిన ఎన్టీఆర్‌ టీమ్

Jr NTR's Office Clarifies on Political Entry Rumours, Denies RAW NTR Activities

టాలీవుడ్ స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. తమిళనాట విజయం సాధించిన ప్రముఖ సినీ నటుడు విజయ్ మాదిరే, ఎన్టీఆర్ కూడా తొలుత సేవా కార్యక్రమాలతో జనాలకి చేరువవుతారని.. దీనిలో భాగంగానే ఈనెల 18నుండి ‘రా ఎన్టీఆర్ (RAW NTR)’ అనే సంస్థ ఆధ్వర్యంలో ‘ఊరు-వాడ’ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోందని, దీనిద్వారా తారక్ ప్రజలను కలుసుకోనున్నారని, ఆరోజు తన రాజకీయ రంగప్రవేశంపై కీలక ప్రకటన కూడా చేయనున్నారని.. ఇలా రకరకాల వార్తలు రోజుకొకటి వినిపిస్తున్నాయి.

దీంతో ఆయన అభిమానులు కూడా ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అభిమానులు ఆయనకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ సైతం దీనిపై ఒకింత కుతూహలం కనబరుస్తోంది. అయితే, ఈ వార్తలు నిజమేనా? ఎన్టీఆర్‌ నిజంగానే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారా? అని అందరూ ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై ఎన్టీఆర్ అధికారిక బృందం స్పష్టత ఇచ్చింది. ‘రా ఎన్టీఆర్ (RAW NTR)’ పేరుతో కొందరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటికి ఎన్టీఆర్ మద్దతు ఉందంటూ వస్తున్న ప్రచారాలపై స్పందిస్తూ.. ఆ సంస్థతో గానీ, వారు చేపడుతున్న కార్యక్రమాలతో గానీ తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది.

‘రా ఎన్టీఆర్’తో ఎలాంటి సంబంధం లేదు

‘రా ఎన్టీఆర్’ అనే సంస్థ లేదా వారు నిర్వహిస్తున్న ‘ఊరూ వాడ’ సేవా కార్యక్రమాలతో హీరో ఎన్టీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు లేదా అధికారిక కార్యాలయానికి ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేశారు. ఆ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అనుమతి లేదా మద్దతు లేదని వెల్లడించారు.

రాజకీయ ప్రచారాలకు చెక్

ఇటీవల ‘రా ఎన్టీఆర్’ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా భారీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించడంతో, వాటి వెనుక ఎన్టీఆర్ ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీంతో ఎన్టీఆర్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలు కూడా విస్తరించాయి. ఈ ప్రచారాలన్నింటికీ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఎన్టీఆర్ బృందం చెక్ పెట్టింది.

అధికారిక ప్రకటనలనే నమ్మాలని సూచన

ఎన్టీఆర్‌కు సంబంధించిన సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేదా రాజకీయ అంశాలపై ఏదైనా సమాచారం ఉంటే.. అది కేవలం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇతర వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రకటనలను అధికారికంగా పరిగణించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

పేరును దుర్వినియోగం చేయొద్దని హెచ్చరిక

ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ఎలాంటి ప్రచారాలు నిర్వహించే హక్కు ఎవరికీ లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన తరఫున కార్యక్రమాలు నిర్వహించడం, ప్రకటనలు చేయడం లేదా రాజకీయ ప్రచారం చేయడం పూర్తిగా అనధికారికమని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పంచుకోవద్దని అభిమానులు, ప్రజలను కోరింది.

వదంతులకు ఫుల్ స్టాప్

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ పేరును రాజకీయ రంగుతో ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటికి ఎలాంటి ఆధారం లేదని ఆయన బృందం వెల్లడించింది. భవిష్యత్తులో ఎన్టీఆర్ చేపట్టే ఏ కార్యక్రమమైనా అధికారిక వేదికల ద్వారానే ప్రకటిస్తామని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here