ఓటరు జాబితాలో పేరు లేకుంటే.. ఫామ్-6 ద్వారా అప్లై చేసుకోవచ్చు – ఈసీ కీలక ప్రకటన

ECI Clarifies, Removed During SIR Can Reapply Through Form 6 Without Prosecution Fear

విశేష సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ అనంతరం ప్రచురించిన ఓటర్ల జాబితాలో పేర్లు లేని పాత ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ECI) కీలక స్పష్టతనిచ్చింది. తమ పేర్లు జాబితా నుంచి తొలగించబడిన వారు ఫామ్-6 (Form 6) ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గతంలో ఓటరుగా నమోదై ఉండి, ప్రస్తుతం జాబితాలో పేరు కనిపించకపోతే ఫామ్-6 నింపడం ద్వారా తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు కాదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది.

ఈ మేరకు ఈనెల 3న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు (CEOs) ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ తర్వాత దేశవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాబితాలో పేర్లు లేని ప్రజలు ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేయడానికి సంకోచించారు.

ఫామ్-6లో “మొదటిసారిగా ఓటరుగా నమోదు చేసుకుంటున్నాను” అనే డిక్లరేషన్ ఉండటంతో, పాత ఓటర్లు దీని ద్వారా అప్లై చేస్తే ప్రాతినిధ్య చట్టం (Representation of the People Act, 1950) సెక్షన్ 31 కింద తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పరిగణించి శిక్షార్హులుగా మారుస్తారేమోనని తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ ఈసీ తాజా లేఖ విడుదల చేసింది.

ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 14న ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. పాత ఓటర్లు తమ పేర్లు తిరిగి చేర్పించేందుకు ఫామ్-6 ఉపయోగించడం వల్ల ఎలాంటి తప్పుడు ప్రాతిపాదన కిందకు రాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫామ్-6 నింపినంత మాత్రాన సెక్షన్ 31 కింద అధికారులెవరూ ఓటర్లపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (EROs) కఠిన ఆదేశాలు ఇచ్చింది.

అయితే, దరఖాస్తుదారులు దేశంలో మరే ఇతర పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెల్లుబాటు అయ్యే ఓటరుగా నమోదు కాకుండా ఉండాలనే నిబంధనను మాత్రం వర్తింపజేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతీ అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే తమ ప్రాథమిక బాధ్యత అని తెలపిన ఎన్నికల సంఘం, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది.

ఈ నిర్ణయంతో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన లక్షలాది మంది పాత ఓటర్లకు పెద్ద ఊరట లభించినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here