ఏపీకి ప్రధాని మోదీ.. రేపు భోగాపురం విమానాశ్రయానికి ప్రారంభోత్సవం, పూర్తి షెడ్యూల్ ఇదే..!

PM Modi To Inaugurate Bhogapuram International Airport Tomoroow, Check The Full Schedule

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.5,640 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు విశాఖపట్నంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏపీ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి బీజం వేయనున్నారు.

భోగాపురంలో అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలు

  • గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్: రూ.5,640 కోట్లతో అందుబాటులోకి వచ్చిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.

  • సెమీకండక్టర్ ప్లాంట్: విశాఖలో ఏటా 9.6 కోట్ల చిప్‌ల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.460 కోట్లతో నిర్మించే తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన.

  • పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు: రూ.5,550 కోట్లతో కర్నూలు-IV రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థకు శంకుస్థాపన, అలాగే కర్నూలు-అనంతపురం సోలార్, విండ్ ఎనర్జీ జోన్లలో రూ.4,370 కోట్ల ప్రసార ప్రాజెక్టుల ప్రారంభం.

  • రహదారి ప్రాజెక్టులు: రూ.1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్:

  • ఉదయం 11:00 గంటలకు: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ను పరిశీలిస్తారు.

  • ఉదయం 11:30 గంటలకు: భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు మొత్తం రూ.17,900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

  • మధ్యాహ్నం 3:30 గంటలకు: కర్ణాటకలోని మైసూర్ శ్రీరామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం ‘వివేక స్మారక’ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు.

ఉత్తరాంధ్ర ప్రాంత రవాణా విప్లవానికి, పారిశ్రామికాభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం అత్యంత కీలకంగా మారనుంది. మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధనం మరియు రవాణా రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఊపునిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here