పోలవరం, విశాఖ ఉక్కుకు భరోసా, వైజాగ్ రైల్వేజోన్, భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లే సాకారం అయ్యాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన నేడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ వేదికపై ప్రసంగిస్తూ, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ఆక్సిజన్‌లా అండగా నిలిచారని, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. విమానాశ్రయం నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు వేగంగా తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదని కొందరు హేళన చేశారని, కానీ ఈ రోజు ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు గూగుల్, ప్రముఖ స్టీల్ కంపెనీల వంటి బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయని వివరించారు. ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని, దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అయ్యే వలసలు పూర్తిగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గడిచిన 12 ఏళ్లుగా దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా, సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారని ప్రశంసించారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజంను అణచివేసి భద్రతను పటిష్టం చేశారన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతంతో పనిచేసే ఇటువంటి నాయకుడిని తన రాజకీయ జీవితంలోనే చూడలేదని, ఆయన నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ శక్తిగా ఎదుగుతుందని ఉద్ఘాటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలు విస్తరించి ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థిక పురోగతిలో కీలక కేంద్రంగా మారబోతోందని స్పష్టమవుతోంది.







































