ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సూర్యలంకకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు, ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యలంక బీచ్, పరిసర ప్రాంతాల అభివృద్ధిపై పలు కీలక అంశాలను వెల్లడించారు.
18 కిలోమీటర్ల బీచ్ కారిడార్
తూర్పు తీరంలో ‘ఆంధ్రా గోవా’గా పేరొందిన సూర్యలంక బీచ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్వదేశీ దర్శన్ పథకం కింద ఇప్పటికే రూ.97.52 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న సుమారు 18 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రత్యేకమైన బీచ్ కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచ స్థాయి వసతులతో పర్యాటక అభివృద్ధి
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేలా సూర్యలంకలో ఆధునిక సదుపాయాలు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేలా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.
చీరాల సమీపంలో కొత్త విమానాశ్రయంపై పరిశీలన
భవిష్యత్తులో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు నేరుగా ఈ ప్రాంతానికి చేరుకునేలా చీరాల సమీపంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తే సూర్యలంకతో పాటు చీరాల పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలపై ఫోకస్
చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సూర్యలంక అభివృద్ధితో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు, బాపట్ల-చీరాల తీర ప్రాంతం ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.







































