కొత్త యూట్యూబర్లకు షాక్.. రూల్స్ మరింత కఠినం, మానిటైజేషన్‌కు రెట్టింపు వాచ్‌టైమ్

YouTube Tightens Monetisation Rules For New Creators From 2027, 8,000 Watch Hours Required

కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఆదాయం పొందాలని భావిస్తున్న కంటెంట్ క్రియేటర్లకు ప్లాట్‌ఫామ్ కీలక మార్పులు ప్రకటించింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YTPP)లో మానిటైజేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు వెల్లడించింది. 2018 తర్వాత తొలిసారిగా YTPPలో భారీ మార్పులు తీసుకురానున్నట్లు తెలిపింది.

ప్లాట్‌ఫామ్‌లో క్రియేటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో షార్ట్స్‌, ప్రకటనలు, ప్రీమియం ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. కొత్త మార్పులు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త క్రియేటర్లకు మరింత కఠిన నిబంధనలు

కొత్త నిబంధనల ప్రకారం యూట్యూబ్‌లో మానిటైజేషన్ పొందాలంటే కొత్త క్రియేటర్లు గతంలో కంటే ఎక్కువ వాచ్‌టైమ్‌ సాధించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధిలో కనీసం 8,000 గంటల వాచ్‌టైమ్ లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 1,000 మంది సబ్‌స్క్రైబర్లతో పాటు ఏడాదిలో 4,000 గంటల వాచ్‌టైమ్ లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధిస్తే YPP మానిటైజేషన్‌కు అర్హత లభిస్తోంది. కొత్త నిబంధనలతో వాచ్‌టైమ్, షార్ట్స్ వ్యూస్ లక్ష్యాలు గణనీయంగా పెరగనున్నాయి.

అయితే ఇప్పటికే YPPలో భాగమై ఆదాయం పొందుతున్న క్రియేటర్లకు ఈ కొత్త అర్హత నిబంధనలు వర్తించవు.

షార్ట్స్ ఆదాయానికి కూడా కొత్త టార్గెట్

2027 ఫిబ్రవరి 1 నుంచి షార్ట్స్ ద్వారా నిరంతరం ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్ ఆదాయం పొందాలంటే గత 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.

ఈ లక్ష్యాన్ని చేరుకోలేని ఛానళ్లు YPPలో కొనసాగవచ్చు. అయితే షార్ట్స్ రెవెన్యూ షేరింగ్ నిలిచిపోతుంది. మళ్లీ 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ సాధిస్తే షార్ట్స్ ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

క్రియేటర్లకు కొత్త ఇన్సెంటివ్‌లు

మరోవైపు క్రియేటర్ల ఆదాయ అవకాశాలను పెంచేందుకు యూట్యూబ్ కొత్త ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌లను కూడా తీసుకురానుంది. యూట్యూబ్ షాపింగ్‌లో నిర్దిష్ట మైలురాళ్లు చేరుకున్న క్రియేటర్లకు బోనస్‌లు, బ్రాండ్ డీల్స్‌కు ప్రోత్సాహకాలు, ట్రెండింగ్ కంటెంట్‌ను అభివృద్ధి చేసే వారికి అదనపు ఆదాయ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టనుంది.

ప్రీమియం లైట్‌తో అదనపు ఆదాయం

యూట్యూబ్ ప్రీమియం లైట్ సేవను అందుబాటులో ఉన్న అన్ని దేశాలకు విస్తరించే ప్రణాళికలు కూడా ప్రకటించింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే నికర ఆదాయంలో 30 శాతం, ప్రీమియం లైట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం క్రియేటర్ల కోసం కేటాయించనున్నట్లు తెలిపింది.

సభ్యులు చూసే సమయం, వీడియోల వ్యూస్ ఆధారంగా ఈ ఆదాయాన్ని క్రియేటర్లకు పంపిణీ చేయనున్నారు. లాంగ్‌ఫార్మ్ వీడియోలకు 55 శాతం, షార్ట్స్‌కు 45 శాతం రెవెన్యూ షేర్‌ లభించనుంది.

ఒరిజినల్ కంటెంట్‌కే ప్రాధాన్యం

కొత్త మార్పులతో యూట్యూబ్‌లో మానిటైజేషన్ పొందడం కొత్త క్రియేటర్లకు మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే రెట్టింపు వాచ్‌టైమ్ సాధించడం అంత సులభం కాదు.

అందువల్ల కేవలం వైరల్ కంటెంట్‌పై ఆధారపడకుండా ఒరిజినల్, నాణ్యమైన కంటెంట్‌ను నిరంతరం అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కొత్త క్రియేటర్లకు కీలకంగా మారనుంది. దీర్ఘకాలంలో ప్రత్యేకమైన కంటెంట్‌ను రూపొందించే క్రియేటర్లకు యూట్యూబ్‌లో మరిన్ని ఆదాయ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here