ఎల్‌నినో ప్రభావం.. ప్రజలపై భారం పడకుండా చర్యలు – సీఎం చంద్రబాబు

CM Chandrababu Reviews AP Economy, Gives Key Directions on El Niño Impact

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, స్థూల దేశీయోత్పత్తి (GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధి

2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 10.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగంలో 13.5 శాతం, పారిశ్రామిక రంగంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు.

2023-24లో రాష్ట్ర రియల్ జీఎస్డీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండగా.. 2025-26 నాటికి అది 9.9 శాతానికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు.

ఎగుమతులు, జీఎస్టీ వసూళ్లలోనూ వృద్ధి

రాష్ట్ర సాధారణ ఎగుమతులు రూ.16,322 కోట్లకు చేరుకుని 10.5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కారణంగా జీఎస్టీ పన్ను వసూళ్లలో 21 శాతం వృద్ధి నమోదై.. రూ.13,282 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.

అలాగే రూ.2.88 లక్షల కోట్ల విలువైన భారీ, మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌తో పాటు రూ.60 వేల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల ద్వారా 73.6 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వివరించారు.

ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం

మరోవైపు ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51.8 శాతం మేర లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం సమతుల్యంగా అమలు చేస్తోందని అధికారులు సీఎంకు వివరించారు.

ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖ తనకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.

అదే సమయంలో సామాన్య ప్రజలపై అదనపు ధరల భారం పడకుండా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం నిర్దేశించుకున్న వృద్ధి లక్ష్యాలను సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.

కంటిజెన్సీ ప్రణాళికపై దృష్టి

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై ప్రత్యేక కంటిజెన్సీ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here