ఏపీలోని గ్రామాల దశ మారేలా.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ప్రణాళికలకు కార్యరూపం

Dy CM Pawan Kalyan’s Vision Rs.422 Cr Sanctioned For Road Connectivity To 158 Remote Habitations in AP

ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రంలోని 158 మారుమూల ఆవాసాలకు తొలిసారిగా రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని గిరిశిఖర గ్రామాలకు ‘అడవితల్లి బాట’ పేరుతో రహదారి సౌకర్యం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా మైదాన ప్రాంతాల్లో రహదారులు లేని పల్లెలు, ఆవాసాలపై దృష్టి సారించింది.

158 ఆవాసాలను ప్రధాన రహదారులతో అనుసంధానించేందుకు మొత్తం 347 కిలోమీటర్ల మేర 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి నిర్మాణ పనులకు అవసరమైన అంచనాలను అధికారులు సిద్ధం చేశారు.

ఈ రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (PMGSY) కింద రూ.422 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా ఐదేళ్లపాటు రహదారుల నిర్వహణ కోసం మరో రూ.24.47 కోట్లు కేటాయించారు. పనులను పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం చేపట్టనుంది.

158 ఆవాసాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించనుండటం ఆనందంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. రోడ్లు, వంతెనల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

రహదారి కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ఈ గ్రామాల ప్రజలకు విద్య, వైద్యం, మార్కెటింగ్‌ వంటి మౌలిక సదుపాయాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానించడం ద్వారా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here