వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. కడప, హైదరాబాద్‌లలో ఈడీ సోదాలు

YS Vivekananda Reddy Assassination Case ED Conducts Searches at Seven Locations

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకు సంబంధించిన మనీలాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ఎంపీ అవినాష్‌ రెడ్డి నివాసాల్లో సోదాలు

ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నివాసంతో పాటు కడప జిల్లా పులివెందులలోని ఆయన ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. అలాగే ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, శేఖర్‌రెడ్డికి సంబంధించిన నివాసాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.

రూ.24 లక్షల నగదు, లాకర్ల తాళాలు స్వాధీనం

సోదాల్లో భాగంగా అవినాష్‌ రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రెండు బ్యాంకు లాకర్ల తాళాలను కూడా సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు డిజిటల్‌ పరికరాలు, హార్డ్‌డిస్క్‌లు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు

సీబీఐ ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఈడీ పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు, హవాలా మార్గాలు తదితర అంశాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

తాజా సోదాలతో వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగిన ఈడీ తనిఖులు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here