మంగళగిరిలో రూ.18 కోట్లతో మోడల్ రైతుబజార్‌.. శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

Minister Nara Lokesh Lays Foundation For Rs.18 Cr Modern Model Rythu Bazar in Mangalagiri

మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న మోడల్ రైతుబజార్‌కు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం శంకుస్థాపన చేశారు. నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో ఈ మార్కెట్‌ను నిర్మించనున్నారు.

అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.18 కోట్ల వ్యయం కానుంది. మొత్తం 5.90 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్, హోల్‌సేల్ మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

రిటైల్ మార్కెట్‌లో 216 స్టాళ్లు, షాపులు

మొత్తం 71,925 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో మోడల్ రైతుబజార్‌ను తీర్చిదిద్దనున్నారు. రిటైల్ విభాగంలో 102 కూరగాయల స్టాళ్లతో పాటు పండ్లు, పూల విక్రయాలకు మరో 54 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇతర అవసరాల కోసం 60 షాపులు కూడా అందుబాటులోకి రానున్నాయి.

హోల్‌సేల్ మార్కెట్‌లో సరుకులను సులభంగా దించేందుకు 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 23 కూరగాయల షాపులను ఏర్పాటు చేయనున్నారు.

కోల్డ్ స్టోరేజీ నుంచి పార్కింగ్ వరకు ఆధునిక సదుపాయాలు

మార్కెట్‌లో కూరగాయలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియా, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కల్పించనున్నారు.

వ్యాపారులు, రైతులు, వినియోగదారుల సౌకర్యం కోసం రవాణా వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

సోలార్ ప్యానెళ్లు.. ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్‌ను పర్యావరణహితంగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్, భవనం టెర్రస్‌పై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు.

రైతులు తమ పంట ఉత్పత్తులను మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా విక్రయించుకునేందుకు ఈ మోడల్ రైతుబజార్ ఉపయోగపడనుంది. మరోవైపు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు, పూలు తదితర ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.

మంగళగిరిలో ఆధునిక మౌలిక వసతులతో రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఉపయోగపడేలా ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here